In a speech punctuated by heavy slogan shouting from the opposition, the Prime Minister accused the Congress of shutting down parliament and bifurcating Andhra Pradesh in haste.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించిందన్నారు. ఏపీ ఎంపీలు పదేపదే నినాదాలు చేస్తున్న సందర్భంలో ప్రధాని మోడీ.. వాజపేయి హయాంలో మూడు రాష్ట్రాల విభజనను గుర్తు చేశారు. మోడీ మాట్లాడుతున్నా ఎంపీలు నిరసన తెలియజేస్తుండటంతో స్పీకర్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పీకర్ వారిస్తున్నప్పటికీ ఎంపీలు తమ నిరసన తెలియజేయడంపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాజపేయి హయాంలో మూడు రాష్ట్రాల విభజన ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిందన్నారు. కానీ యూపీఏ హయాంలో మాత్రం సభకు తలుపులు వేసి ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్ర విభజన చేసిందన్నారు.
ఎన్నికల ప్రయోజనాల కోసం నాడు యూపీఏ ప్రభుత్వం ఏపీని విభజించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఏపీ రాష్ట్రాన్నే కాదని, దేశాన్ని మోసం చేసిందని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. దేశ విభజన పాపం కూడా కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ఆ పాపాన్ని ఇప్పటికీ 125 కోట్ల మంది ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు.
రాష్ట్ర విభజన ఇబ్బంది కాదని నరేంద్ర మోడీ అన్నారు. కానీ విభజన చేసిన తీరు ఇబ్బందికరమని చెప్పారు. ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినకుండా విభజన చేయాలని తాము అప్పుడు, ఇప్పుడు కోరామన్నారు. తెలంగాణ ఏర్పాటు కావాల్సిందేనని, కానీ తలుపులు మూసి విభజించడం సరికాదని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనకంటే తర్వాత స్వాతంత్రం వచ్చి న దేశాలు బాగుపడ్డాయన్నారు. కేవలం ఒక కుటుంబం బాగుండటం కోసం ఇన్నాళ్లు కాంగ్రెస్ పాలించిందని ఎద్దేవా చేశారు.
కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటూ ఉంటే ఆశ్చర్యపోవాల్సిందేనని మోడీ అన్నారు. నాడు హైదరాబాదులో దళిత ముఖ్యమంత్రిని నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అవమానించారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.