AP Ex Minister Peddireddy Land Scam : చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన భూ కబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జనవరి 29న పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం గుట్టును ‘ఈనాడు’ ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది. దానిపై అప్పట్లో విలేకరుల సమావేశం నిర్వహించిన పెద్దిరెడ్డి, ఆ భూములన్నీ తాను కాయకష్టం చేసి, చెమటోడ్చి సంపాదించుకున్నవి అన్నట్లుగా అడ్డగోలుగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు, పెద్దిరెడ్డి భారీగా అటవీ భూముల్ని ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని నిగ్గుతేల్చారు.
295, 296 సర్వే నంబర్లలో 23.69 ఎకరాల పట్టా భూమి మాత్రమే ఉంటే అటవీ భూమిని ఆక్రమించి 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకుని దాని చుట్టూ కంచె వేశారని విజిలెన్స్ బయటపెట్టింది. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట వెబ్‌ల్యాండ్‌లో 77.54 ఎకరాలు ఎక్కించుకున్నట్లు తెలిపారు. రాజకీయ పలుకుబడి, అధికార దుర్వినియోగంతో అటవీ భూములను కబ్జా చేసి పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్నట్లు తేల్చింది. వ్యవసాయ క్షేత్రం వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు కూడా వేసుకున్నట్లు ఇటీవల ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొంది.