Telangana Assembly Sessions : తెలంగాణ అసెంబ్లీ ఇవాళ "భూ భారతి'' బిల్లుపై చర్చించి ఆమోదం తెలపనుంది. అనంతరం రైతు భరోసా విధివిధానాలపైనా సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. జీహెచ్‌ఎంసీ, పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు ఇప్పటికే శాసనసభ ఆమోదం పొందాయి. హైడ్రాకు అధికారాలను కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు పలు అభ్యంతరాలు లేవనెత్తారు. అనాలోచితంగా అనేక నిర్మాణాలను కూల్చివేశారని, పేదలు భయపడే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ సభ్యులు విమర్శించారు. చెరువులు, కుంటలు పక్కన పేదల ఇళ్లు లక్షల సంఖ్యలో ఉంటాయని వారందరికి భరోసా ఇవ్వాలని కోరారు.