హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్​ కూల్చివేసిన హైడ్రా

2024-08-24 8

Madhapur N Convention Demolished by HYDRA : కబ్జాదారుల వెన్నులో హైడ్రా వణుకు పుట్టిస్తోంది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇవాళ హైదరాబాద్​ మాదాపూర్​లోని ఎన్​ కన్వెన్షన్​ను హైడ్రా కూల్చేసింది. ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ కన్వెన్షన్​ దగ్గరకు చేరుకున్న హైడ్రా అధికారుల బృందం, కూల్చివేతలు ప్రారంభించింది. ఈ కన్వెన్షన్​ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందినదిగా తెలుస్తోంది.

అక్రమంగా నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వస్తున్న తుమ్మిడి చెరువు 28 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు మూడున్నర ఎకరాల భూమిని నటుడు నాగార్జున కబ్జా చేసి కట్టడాలను నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం హైడ్రాకు ఫిర్యాదు అందడంతో నిర్మాణం చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు, పలు కోణాల్లో పరిశోధించి తదనుగుణంగా చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.

ఎన్​ కన్వెన్షన్​ను కూల్చివేయాలని హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి లేఖ : ఎన్​ కన్వెన్షన్​పై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్​కు ఈ నెల 21వ తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. తుమ్మిడికుంట ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​లో ఎన్​ కన్వెన్షన్​ ఆక్రమణలను హైడ్రాకు రాసిన లేఖలో మంత్రి కోమటిరెడ్డి వివరించారు. ఈ కన్వెన్షన్​కు సంబంధించిన శాటిలైట్​ ఫొటోలతో సహా ఆధారాలను హైడ్రాకు అందించారు. మంత్రి కోమటిరెడ్డి లేఖపై విచారణ జరిపిన తర్వాతే ఎన్​ కన్వెన్షన్​ కూల్చివేతని హైడ్రా చేపట్టింది.