విద్యార్ధులకు మానసిక ఆనందం, వాహనాలపై అవగాహన కల్పించడానికి నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం చేసిన ప్రయోగం ప్రశంసలు అందుకుంటోంది. రైలు మాదిరిగా వాహనాన్ని తయారుచేయించిన యాజమాన్యం.. అందులో విద్యార్థులను ఎక్కించుకుని నగరవీధుల్లో తిప్పుతోంది. అచ్చం రైలులా కనిపించే ఈ వాహనానికి ముందు ఇంజిన్, వెనుక 3 బోగీలు ఏర్పాటు చేసారు. ఈ వాహనానికి కార్లకు ఉండే చక్రాలు అమర్చడంతో పట్టాలు అవసరం లేదు. ఈ వినూత్న వాహనం ఇప్పుడు భైంసా పట్టణంలోని రహదారులపై కూతలు పెడుతూ పరుగులు తీస్తోంది. అది చూసి పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేయడంతో పాటు పాఠశాల యాజమాన్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.