శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ కార్యకర్త ఆత్మహత్య కలకలంరేపింది. మందస మండలం పొత్తంగి కి చెందిన కోన వెంకటరావు పురుగుల మందు తాగాడు.. వెంటనే అతడ్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయారు. వెంకటరావు ప్రాణాలు తీసుకోవడానికి పొలీసులు, వైఎస్సార్‌సీపీ నేతల వేధింపులు కారణమని అతడి భార్య ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీని ప్రశ్నించాడని పోలీసులు వేధించారని.. అందుకే పురుగుల ముందు తాగి ప్రాణాలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ ఘటన గురించి తెలియడంతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష టీడీపీ కార్యకర్త కోన వెంకటరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆసుపత్రి దగ్గర మృతుడి భార్య కృష్ణవేణిని ఓదార్చిన శిరీష భావోద్వేగానికి గురయ్యారు. వెంకటరావు మృతికి కారణమైన పోలీసులు వచ్చే వరకు మృతదేహాన్ని తీసుకువెళ్ళేది లేదని ధర్నాకు దిగారు. ఎలాంటి నోటీసులు లేకుండా తమ కార్యకర్తల ఇళ్లకు వెళ్లే అధికారం పోలీసులుకు ఎవరిచ్చారని శిరీష ప్రశ్నించారు.