దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ "హ్యుందాయ్ క్రెటా" మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. హ్యుందాయ్ ఈ ఏడాది ఆరంభంలో దేశీయ మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 1,15,000 యూనిట్లు అమ్ముడయినట్లు కంపెనీ తెలిపింది.
ఈ విభాగంలో కొత్త 2020 హ్యుందాయ్ క్రెటా బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా నిలిచింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఈ మోడల్ కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధిస్తోంది. హ్యుందాయ్ పేర్కొన్న సమాచారం ప్రకారం, ప్రతి నెలా క్రెటా అమ్మకాలు పెరుగుతూనే వస్తున్నాయి. భారత మార్కెట్లో ఈ ఎస్‌యూవీ విజయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి, ఇందులో ప్రధానంగా క్రెటాలో లభించే ఇంజన్ ఆప్షన్స్ అని చెప్పుకోవచ్చు.