ప్రపంచంలో కోహ్లీనే నంబర్ వన్ బ్యాట్స్‌మెన్

2019-02-16 1

మోడ్రన్ డే క్రికెట్‍‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులు ఉన్నారు. బరిలోకి దిగాడంటే చాలు పరుగులు వరద పారాల్సిందే. ఫార్మాట్ ఏదైనా సరే సెంచరీలు బాదాల్సిందే. ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో అనేక రికార్డులను విరాట్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి కోహ్లీపై దేశవాళీ క్రికెట్‌లో అత్యున్నత బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని 10 సార్లు రంజీ ట్రోఫీ విన్నర్ అయిన వసీమ్ జాఫర్ ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 24 నుంచి టీమిండియా రెండు టీ20లు, ఐదు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ ఆడనుండటంతో తాజాగా వసీమ్ జాఫర్ మీడియాతో మాట్లాడాడు.
"ప్రస్తుత క్రికెట్‌ ప్రపంచంలో విరాట్ కోహ్లీనే నంబర్ వన్ బ్యాట్స్‌మెన్. తన అద్భుతమైన ఆట, ఫిట్‌నెస్‌తో కెరీర్ గ్రాఫ్‌ను క్రమంగా పెంచుకుంటూ పోతున్నాడు. మైదానంలో బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో ఎంతో మంది యువ క్రికెటర్లకి రోల్‌ మోడల్‌గా నిలుస్తోన్న విరాట్ కోహ్లీ.. విదేశీ గడ్డపైనా విజయాలతో జట్టులో స్ఫూర్తి నింపాడు" అని జాఫర్ అన్నాడు.
"అనేక రికార్డులను నమోదు చేయడంతో పాటు జట్టుని విజయాల్లో నడిపిస్తోన్న తీరు అద్భుతం. గత కొన్ని సంవత్సరాలుగా అటు స్వదేశంతో పాటు విదేశాల్లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. గత రెండేళ్లుగా కోహ్లీ నాయకత్వంలో టీమిండియా తిరుగులేని జట్టుగా ఎదిగింది" అని జాఫర్ కితాబిచ్చాడు.
ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియాను గెలిపించడం ద్వారా 72 ఏళ్ల నిరీక్ష‌ణకు విరాట్ కోహ్లీ తెరదించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆసీస్ గడ్డపై వన్డే సిరిస్‌తో పాటు న్యూజిలాండ్ గడ్డపైనా వన్డే సిరీస్‌ను గెలిపించి కెప్టెన్‌గా కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

Indian veteran cricketer Wasim Jaffer has said that Virat Kohli is the best player in this world right now and he would pay to watch the Indian skipper play on any given day.