ఇండోనేసియా రాజధాని జకార్తా వేదికగా ఆగస్టులో జరిగే ఆసియా గేమ్స్‌లో భారత కబడ్డీ జట్టు ఎనిమిదో స్వర్ణ పతకం సాధించడం ఖాయమని జట్టు కెప్టెన్ అజయ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశాడు. అయితే, ఆసియా గేమ్స్‌లో ఇరాన్, పాకిస్తాన్ జట్లనుంచి భారత్ గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.జకార్తా వేదికగా ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆసియా గేమ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత కబడ్డీ జట్టు కెప్టెన్ అజయ్ ఠాకూర్ మాట్లాడుతూ "ఆసియా గేమ్స్‌లో భారత కబడ్డీ పురుషుల, మహిళా జట్లు 8, 3వ స్వర్ణ పతకాలు సాధించడం ఖాయం" అని అన్నాడు.
"మనవాళ్లు స్థిరమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. ఎంత వత్తిడినైనా అధిగమించి ఆట సాగించగల సమర్థులు. కబడ్డీ మాస్టర్స్ దుబాయ్ 2018లో ఘన విజయం ఆటపై మరింత స్పిరిట్ పెంచింది. ఆసియా గేమ్స్‌లో ప్రధానంగా పాకిస్తాన్, ఇరాన్, కొరియా జట్లనుంచి బలమైన పోటీ ఎదురుకావొచ్చు. ఇప్పుడు మా లక్ష్యమంతా ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించడంపైనే" అని ఠాకూర్ అన్నాడు.