స్వతంత్ర భారత చరిత్రలోనే చీకటి రోజులుగా ఎమర్జెన్సీ కాలాన్ని పేర్కొనవచ్చు. దేశ ప్రజల స్వేచ్చనే ప్రశ్నార్థకం చేసిన ఎమర్జెన్సీ విధించి నేటికి సరిగ్గా 41 ఏళ్లు. 25 జూన్ 1975న రాత్రి 11 గంటల 45 నిమిషాలకు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రకటించారు. 1977 మార్చి 21 వరకు ఈ పరిస్థితి కొనసాగింది. ఈ 21 నెలలపాటు దేశంలోని పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగింది. ఎమర్జెన్సీని ప్రకటించింది రాష్ట్రపతే అయినప్పటికీ ఆ దిశగా ఆయన నిర్ణయం తీసుకునే బలవంతం చేసింది నాటి ప్రధాని ఇందిరా గాంధీనే అనేది అందరికీ తెలిసిందే. తన రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేయడానికి, వ్యతిరేకంగా ఉన్న మీడియా గొంతు నొక్కి పత్రికా స్వేచ్ఛను హరించడానికి ఎమర్జెన్సీ అనేది ఇందిరకు ఓ ఆయుధంలా ఉపయోగపడింది. ఆమె కుమారుడు సంజయ్ గాంధీ ముందుండి నడిపిన సామూహిక గర్భనివారణ కార్యక్రమం వంటి ఇతర దురాగతాలకు కూడా ఈ కాలంలో అడ్డులేకుండా పోయింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ ప్రకటించడం అనేది అత్యంత వివాదాస్పదమైన నిర్ణయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.