ఢిల్లీ లో ఎయిర్‌హోస్టెస్‌ అనుమానాస్పద స్థితిలో మృతి

2018-07-16 518

దేశ రాజధాని నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఎయిర్‌హోస్టెస్‌ భవనంపై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆమె భర్త ఇది ఆత్మహత్య అని చెప్తుండగా.. యువతి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని హత్య చేశారని చెబుతున్నారు.
అనిస్సియా భత్రా అనే 32ఏళ్ల యువతి లుఫ్తాన్సా‌ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని పంచశీల పార్కు ప్రాంతంలోని ఇంటిపై నుంచి శుక్రవారం రాత్రి దూకడంతో ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. అయితే కొంతకాలంగా అత్తింటి వారు ఆమెను వేధిస్తున్నారని.. ఇది హత్యే అని అనిస్సియా తల్లిదండ్రులు చెబుతున్నారు.
అనిస్సియాకు రెండేళ్ల క్రితం మయాంక్‌ సింఘ్వితో వివాహమైందని, అప్పటి నుంచి ఆమె భర్తతో పాటు అత్తింటి వారంతా వేధిస్తున్నారని అనిస్సియా తండ్రి రిటైర్డ్ మేజర్‌ జనరల్‌ ఆర్‌ఎస్‌ భత్రా గత కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం తాగి వచ్చి ఆమెను డబ్బు కావాలని హింసిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అని రాతపూర్వకంగా పోలీసులు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.