బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు యావత్ భారతావనిలోని అభిమానులు తమ అఖిల భారత అభిమాన కథా నాయిక శ్రీదేవి మరణంతో శోక సముద్రంలో మునిగిపోయారు. ఆమె పార్ధివ దేహం రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వేళ.. అందరి మనస్సులు చూరగొన్న అతిలోక సుందరి మరణం వెనుక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మేనల్లుడి పెళ్లి కోసమని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే మృతి చెందింది. ఆమె మరణానికి కారణాలేమైనా.. ఆమె భర్త బోనీ కపూర్‌ను దుబాయి పోలీసులు మూడున్నర గంటల పాటు విచారించడంతోపాటు అంతా కొలిక్కి వచ్చే వరకు దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి శ్రీదేవి కూడా మిగతా సినీ నటీమణుల జాబితాలోనే చేరిపోయారా? కుట్ర కోణం నుంచి సినీ నటీమణులు తప్పించుకోలేరా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
శ్రీదేవి మాదిరిగానే దక్షిణ భారత సినీ నటీమణులు పలువురు అనుమానాస్పదంగా, యుక్త వయస్కులుగా ఉండగానే మరణించారు. అలనాటి మహా నటి సావ్రితి 47 ఏళ్లకే మరణిస్తే.. 14 ఏళ్ల క్రితం చనిపోయిన సౌందర్య వయస్సు 34 ఏళ్లే మరి. వీరంతా సినీ రంగంలో తమ ప్రొఫెషన్ పట్ల అంకిత భావంతో పని చేసిన వారే.
‘సంసారం' సినిమాతో సెల్యూలాయిడ్‌పై వెలుగు వెలిగిన సావిత్రి తర్వాత పలు తెలుగు సినిమాల్లో ఆదర్శప్రాయమైన పాత్రలు పోషించారు. తర్వాతీ దశలో జెమినీ గణేశన్‌ను వివాహం చేసుకున్నారు. కారణాలేమైనా జెమినీ గణేశన్‌తో వైవాహిక జీవితంతో అంతా బాగాలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో తాగుడుకు బానిసై.. చివరి దశలో ఆరోగ్య సమస్యలతో గుర్తించని పరిస్థితి నెలకొంది. దక్షిణాది సినీ రంగాన్ని ‘మహారాణి'గా ఏలిన సావిత్రి.. చివరకు దురదృష్టకరమైన రీతిలో కన్నుమూయడం విషాదమే.