'రంగస్థలం' చిత్రంలో రంగమ్మత్త లాంటి పవర్ ఫుల్ పాత్రలో అనసూయ నటన సినిమాకే హైలెట్ అయింది. ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అనసూయ దశ తిరిగిందని చెప్పవచ్చు. ఈ మూవీ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తినా సెలెక్టెడ్‌గా పాత్రలు ఎంచుకుంటోంది. తాజాగా అనసూయకు రంగస్థలం తరహాలోనే పవర్ ఫుల్ పాత్ర చేసే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'యాత్ర'లో ఈ హాట్ యాంకర్ ఎంపికైనట్లు సమాచారం.
‘యాత్ర' మూవీలో కర్నూలు జిల్లాకు చెందిన పవర్ ఫుల్ మహిళా నేత పాత్ర కోసం అనసూయను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఫుల్ లెంగ్త్ రోల్ కాదని, అతిథి పాత్ర మాత్రమే అని టాక్. అయితే ఈ విషయమై దర్శక నిర్మాతల నుండి క్లారిటీ రావాల్సి ఉంది.
వైఎస్ఆర్ హయాంలో కర్నూలు జిల్లాలో బలమైన మహిళా నేతగా శోభా నాగిరెడ్డి చక్రం తిప్పారు. అనసూయ కర్నూలు జిల్లా మహిళా నేత పాత్రలో కనిపించబోతోందనే వార్తలు తెరపైకి రాగానే.... అది శోభా నాగిరెడ్డి పాత్ర అయుండొచ్చు అనే చర్చ మొదలైంది.
మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మళయాల సూపర్‌స్టార్ మమ్మూట్టి నటిస్తున్నారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ పాత్రలో 'బాహుబలి' ఫేం అశ్రితా వేముగంటి. వైఎస్ వ్యక్తిగత సహాయకుడు సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి, వైఎస్ ప్రాణ స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు పాత్రలో రావు రమేష్, వైఎస్ఆర్ హయాంలో హోం మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని ఎంపికయ్యారు.