6వ రోజుకు చేరిన సి.ఎం రమేష్ దీక్ష

2018-06-25 244

కడప స్టీలు ప్లాంటు కోసం ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి చేపట్టిన ఆమరణ దీక్ష ఆరవ రోజుకు చేరుకుంది. అయితే గత ఆరు దినాలుగా దీక్ష చేస్తుండటంతో సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. షుగర్ లెవల్స్ క్రమంగా పడిపోతున్నాయి.
అయితే ఆరోగ్యం క్షీణించినప్పటికీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయ్యే వరకు తమ దీక్షను మాత్రం ఆపేదే లేదని ఈ ఇరువురు నేతలు స్పష్టం చేశారు. ఆదివారం వీరిని పరీక్షించిన వైద్యులు రమేశ్, రవి ఇద్దరూ బరువు తగ్గారని...చాలా నీరసంగా ఉన్నారని...షుగర్ లెవల్స్, బీపీ పడిపోయాయని తెలిపారు. మరోవైపు దీక్షతో వీరి ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి చేస్తున్న నిరాహార దీక్ష సోమవారంకు ఆరో రోజుకు చేరుకుంది. ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. మంత్రులు చిన్నరాజప్ప, గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసులు, పత్తిపాటి పుల్లారావు, ఆదినారాయణరెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, విప్‌ రామసుబ్బారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ పుత్తా సుధాకర్‌యాదవ్‌, దర్శకేంద్రుడు రాఘవేందర్‌రావు, నాయకులు హరిప్రసాద్‌, దుర్గాప్రసాద్‌, జిలానీబాషా తదితరులు బైఠాయించారు. ఎంపీ టీజీ వెంకటేశ్‌, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి సంఘీభావం తెలిపినవారిలో ఉన్నారు.