కడప స్టీల్ ప్లాంట్ బంద్ కు పవన్ మద్దతు

2018-06-25 717

Jana Sena chief Pawan Kalyan slams TDP for Kadapa steel plant, JAC meeting on implementation of 2013 Land acquisition act.
#JanaSena
#JAC

కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేస్తున్నారు. మరోవైపు, స్టీల్ ప్లాంట్ తాను కడతానని, లేదంటే తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని గాలి జనార్ధన్ రెడ్డి అంటున్నారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీలో టీడీపీ ఆందోళనలు కొనసాగిస్తున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి గట్టి షాకిచ్చారు.
అసలు స్టీల్ ప్లాంట్ రాలేదని టీడీపీ నాయకులు గోల చేస్తున్నారని, కానీ అసలు వారి వల్లే పరిశ్రమ రాలేదని పవన్ నిప్పులు చెరిగారు. అప్పట్లో దీని నిర్మాణం కోసం జిందాల్ సంస్థ ముందుకు వస్తే అడ్డుకున్నారని విమర్శలు గుప్పించారు. ఆయా నాయకులకు లబ్ధి చేకూరితేనే కర్మాగారం ఏర్పాటు కావాలా? లేకపోతే కాకూడదా? ఇదెక్కడి ద్వంద్వ వైఖరి? అని టీడీపీని ప్రశ్నించారు.
లండన్‌లో తాను పర్యటించినప్పుడు అక్కడి పారిశ్రామికవేత్తలు తమ ఆవేదనను చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఎంత వాటాలు, పర్సంటేజీలు ఇస్తారని అడిగే స్థాయికి మీ ప్రభుత్వాలు పడిపోవడం చాలా ఇబ్బంది కలిగిస్తోందని, అందుకే తాము రావడం లేదని వారు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వ్యవహారం కూడా తనకు అదే కోవలో కనిపిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులను జనసేన, సీపీఎం, సీపీఐ కలిసి మార్చాలనుకుంటున్నాయన్నారు.
తమ మూడు పార్టీలు ఒకే ఆలోచన విధానంతో ఉన్నాయని, తమతో పాటు ఇంకెవరైనా కలిసి వచ్చినా వారితో కలిసి ముందుకెళ్తామని పవన్ తెలిపారు. మూడు, నాలుగు నెలల తర్వాత అందరం కలిసి ఉమ్మడి కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. హామీలు నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే తాను బయటకు వచ్చానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగం పెరిగి, యువతలో అసాంతి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.