Sri Lanka captain Dinesh Chandimal on Tuesday (June 19) has been suspended from his side's third and final Test against the West Indies after he was found guilty of changing the condition of the ball during the second day's play of the second Test, which concluded at Gros Islet on Monday (June 18).
శ్రీలంక టెస్టు కెప్టెన్ దినేశ్ చండీమాల్‌పై ఐసీసీ వేటు వేసింది. కరేబియన్ గడ్డపై వెస్టిండిస్‌తో జరిగిన రెండో టెస్టులో దినేశ్ చండీమాల్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ అతడిపై ఓ టెస్టు మ్యాచ్ సస్పెన్షన్ విధించాడు.
దీంతోపాటు మ్యాచ్ ఫీజులో వందశాతం జరిమానా విధించింది. ఫలితంగా వెస్టిండిస్‌తో జరిగే మూడో టెస్టుకు దినేశ్ చండీమాల్ దూరం కానున్నాడు. తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని తొలుత బుకాయించిన చండీమాల్ ఆ తర్వాత నిజాన్ని అంగీకరించాడు. బాల్‌ను షైన్ చేసేందుకు కృత్రిమ పదార్థాన్ని ఉపయోగించినట్టు ఐసీసీ విచారణలో వెల్లడైంది.
మ్యాచ్ వీడియో ఫుటేజీ పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జవగళ్ శ్రీనాథ్ మాట్లాడుతూ బంతిపై కృత్రిమ పదార్థాన్ని రాసినట్టు రివ్యూలో స్పష్టంగా కనిపించిందని అన్నాడు. దానికి లాలాజలం రాసి బంతిని మెరిపించే ప్రయత్నం చేసినట్టు గుర్తించామని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనావళిని అనుసరించి అతడిపై చర్యలు తీసుకున్నట్టు వివరించాడు. చండీమాల్‌పై సస్పెన్షన్ వేటు వేయడాన్ని ఐసీసీ కూడా సమర్ధించింది. బాల్ టాంపరింగ్ విషయంలో మ్యాచ్ అధికారులకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఐసీసీ ఈ సందర్భంగా తెలిపింది.