U.S. President Donald Trump and North Korean leader Kim Jong Un met face-to-face Tuesday morning for their highly anticipated summit.
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మంగళవారం తెల్లవారుజామున భేటీ అయ్యారు. సింగపూర్‌లోని కేపెల్లా హోటల్‌లో మొదట స్నేహపూర్వకంగా కరచాలనం చేసిన ఇరువురు దేశాధినేతలు.. అనంతరం నవ్వుతూ కెమెరాకు ఫోజు ఇచ్చారు.
‘మిమ్మల్ని కలువడం ఆనందంగా ఉంది' అని కిమ్ అంటే.. కిమ్‌తో తన భేటీ అద్భుతమైన విజయం సాధిస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘నాకు ఎంతో గొప్పగా ఉంది. మన సమావేశం నిజంగా ఫలప్రదం కాబోతుందని నేను భావిస్తున్నాను. మన మధ్య అద్భుతమైన అనుబంధం నెలకొనబోతోంది. ఆ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు' అని ట్రంప్ కిమ్‌తో పేర్కొన్నారు.
ఈ క్రమంలో కిమ్ స్పందిస్తూ.. ‘ఇంతవరకు రావడం మామూలు విషయం కాదు. గతం మనముందు ఎన్నో అడ్డంకులు ఉంచింది. కానీ వాటన్నింటినీ అధిగమించి మనం ఈ రోజు ఇక్కడివరకు వచ్చాం' అని అన్నారు. మొదట ఇరువురు నేతలు కొంత అప్రమత్తతతో ముభావంగా ఉన్నట్టు కనిపించినా.. ఆ తర్వాత కాస్తా హుషారుగా పరస్పరం స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు.