Indian skipper Virat Kohli will be awarded the prestigious Polly Umrigar Award at the BCCI awards on June 12th in Bangalore for his exceptional performances in the last two cricketing seasons.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు చేరింది. అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌కు ఇచ్చే పాలీ ఉమ్రిగర్ అవార్డు ఈ ఏడాది కూడా కోహ్లీనే వరించింది. ఈ అవార్డుని అందుకోవడం కోహ్లీ ఇది వరుసగా నాలుగోసారి. తద్వారా ఈ అవార్డును నాలుగుసార్లు గెలిచిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
ఈ మేరకు బీసీసీఐ గురువారం అధికారికంగా ప్రకటించింది. విరాట్ కోహ్లీతోపాటు మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కూడా అత్యుత్తమ క్రికెటర్లుగా ఎంపికయ్యారు. జూన్ 12న బెంగళూరు వేదికగా జరగనున్న బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డులని అందజేయనున్నట్లు బోర్డు వెల్లడించింది.
2014, 2015లతోపాటు 2016, 2017 ఏడాదిలకు కలిపి మొత్తంగా నాలుగోసారి విరాట్ కోహ్లీ పాలి ఉమ్రిగర్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇక, మహిళల జట్టు విషయానికి వస్తే తొలిసారి ఈ అవార్డును ఇవ్వబోతున్నారు. గతేడాది మహిళల ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ జట్టుని ఫైనల్‌కి చేర్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ 2016-17కి గాను ఈ అవార్డుకి ఎంపికైంది.
గతేడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న ఓపెనర్ స్మృతి మంధాన 2017-18 ఏడాదికిగానూ అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎంపికైంది. ‘బీసీసీఐ అవార్డులని గెలుచుకున్న క్రీడాకారులకి నా అభినందనలు. గత రెండేళ్లుగా భారత పురుషులు, మహిళల జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. వారి విజయాల్ని చూసి మేము గర్వపడుతున్నాం' అని బీసీసీఐ పరిపాలక కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు.