Tollywood Veteran Director Tammareddy Bharadwaj Supports Mahanati Movie Director Nag Ashwin and he reacts on Gemini Ganesan's ROLE in Mahanati Movie.
సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' విడుదల తర్వాత జెనిమీ గణేశన్ మొదటి భార్య కూతుర్లు మీడియా ముందుకొచ్చి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమ తండ్రిని తప్పుగా చూపించారని గొడవ చేయడం, దీనికి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి కౌంటర్ ఇవ్వడంతో అప్పటి వరకు జనాల్లో 'మహానటి' సినిమాపై ఉన్న అభిప్రాయాలు మారడం ప్రారంభం అయింది. ఈ పరిణామాలపై తెలుగు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహానటి తర్వాత మేమంతా తలెత్తుకుని తిరుగుతున్నాం. తెలుగులో మరో మంచి సినిమా వచ్చింది. మాకు ఒక మంచి డైరెక్టర్ దొరికాడు అని ఆనందపడ్డాం. జనం కూడా సినిమాకు నీరాజనాలు పలకడంతో చాలా సంతోషం కలిగింది. ఈ పరిస్థితుల్లో జెమినీ గణేశన్ పిల్లలు మా నాన్నను అసహ్యంగా చూపించారని రకరకాలుగా ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చి గొడవ చేయడం బాధేసింది అని తమ్మారెడ్డి తెలిపారు.
నిజానికి ఈ చిత్రంలో జెమినీ గణేశన్‌ను చాలా ఎలివేట్ చేసి చూపించారు. నాకు సావిత్రి పర్సనల్ గా తెలుసు. వారి పెళ్లి సమయానికి నేను చిన్నవాడిని అయినా... అప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. చాలా సినిమాలు సారథి స్టూడియోలో చేశారు. ఆ సమయంలో మా నాన్నగారు అక్కడ మేనేజర్‌గా ఉండేవారు. మా ఉద్దేశ్యంలో.... ఆమె పరిచయం ఉన్న మాలాంటి వారు కూడా జెమినీ గణేశన్ విలన్ అనే అనుకునే వాళ్లం. నిజానికి మహానటి సినిమా చూసిన తర్వాత చాలా డిసప్పాయంట్ అయ్యాను. జెమినీ గణేశన్ వల్లే సావిత్రి ఇండస్ట్రీలోకి వచ్చింది అన్నట్లుగా చూపించారు. ఒక వేళ అది నిజం అయినా కానీ అది ఉండి ఉండక పోతే బావుండేది అనేది నా ఆలోచన. నాగాశ్విన్ అలా ఆలోచించాడు కాబట్టే ఇది సూపర్ హిట్టయింది.... అని తమ్మారెడ్డి తెలిపారు.