The first look poster of Srinivas Reddy starrer Jamba Lakidi Pamba was released today by actor Naresh Vijaya Krishna.
జంబలకిడి పంబ అనే పేరు వినగానే నరేశ్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ చేసిన నవ్వుల సందడి గుర్తుకొస్తుంది. తాజాగా అదే పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి కథానాయకుడు. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా వంటి వైవిధ్యమైన సినిమాలతో కథానాయకుడిగా అడుగులు వేసిన శ్రీనివాసరెడ్డి నటిస్తోన్న తాజా సినిమా ఇది. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని కథానాయిక. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్ కీలక పాత్రధారులు. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వం వహిస్తున్నారు. రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మాతలు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని నాటి జంబలకిడి పంబ హీరో డా. వి.కె.నరేశ్ హైదరాబాద్‌లో విడుదల చేశారు.
డా.వి.కె. నరేశ్ మాట్లాడుతూ ``బహుశా `జంబలకిడి పంబ` అనే టైటిల్ ఒకటి వస్తుందని కూడా ఎవరూ ఊహించి ఉండరు. వచ్చినప్పటి నుంచీ ఎవరూ మర్చిపోలేదు. ఇలాంటి టైటిల్ మళ్లీ ఇంకో సినిమాకి పెడతారని కూడా అనుకోరు. నేను చాలా ఇష్టంతో సత్యం అని పిలుచుకునే మా ఈవీవీ సత్యనారాయణ సృష్టించిన అద్భుత కావ్యం `జంబలకిడి పంబ`. ఈ చిత్రాన్ని `మాయాబజార్`తో పోల్చలేం కానీ... తెలుగు సినిమాల్లో ఆణిముత్యం అని మాత్రం చెప్పవచ్చు.
ఈవీవీగారితో నాది 40 ఏళ్ల అనుబంధం. ఒకరోజు నేను తిరుపతిలో ఉండగా `ఓ అద్భుతమైన కథ చెబుతాను` అని ఈవీవీగారు వచ్చారు. వినగానే `రెగ్యులర్ గా లేకుండా, అద్భుతంగా ఉంది చేస్తున్నా` అని అన్నాను. `రివర్స్ గేర్` అని టైటిల్ అనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. `అలా కాకుండా.. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టైటిల్ ఉంటే బావుంటుంది` అని నేను అన్నాను. సరేనని వెళ్లారు. అప్పట్లో సెల్‌ఫోన్లు లేవు. మద్రాసు నుంచి తెల్లారుజామున నాలుగు గంటలకు ట్రంక్ కాల్ చేసి `జంబలకిడి పంబ` అని అన్నారు. అదేంటంటే.. టైటిల్ అని చెప్పారు. అలా ఆ సినిమా మొదలైంది. అలీ అందులో అద్భుతమైన పాత్ర చేశారు.