Sri Lanka Cricket Board Hikes Player Wages

2018-05-24 82

Sri Lanka's cricket board today increased wages for national players by more than a third after making record profits in 2017.

శ్రీలంక క్రికెట్ బోర్డు తమ క్రికెటర్ల కోసం కొత్త వేతన సవరణ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా శ్రీలంక క్రికెటర్ల వేతనాలు భారీగా పెరిగాయి. 2017లో రికార్డు స్థాయిలో లాభాలు రావడంతో జాతీయ ఆటగాళ్ల వేతనాలను 34 శాతం పెంచుతూ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ బోర్డుతో కాంట్రాక్ట్‌లో ఉన్న 33 మంది క్రికెటర్లకూ భారీగా వేతనాలు పెరగనున్నాయి. గతేడాది మంచి ఫలితాలు సాధించడంతో 2018-19 ఏడాదికి గాను ఆటగాళ్ల వేతనాలు పెంచినట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
2017కు గాను శ్రీలంక బోర్డుకు 2.12 బిలియన్ రూపాయల వార్షిక ఆదాయం వచ్చినట్టు గతవారం బోర్డు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఇది 33 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. గతేడాది శ్రీలంక స్వదేశంలో జింబాబ్వే, బంగ్లాదేశ్, ఇండియాలతో సిరిస్‌లు ఆడిన సంగతి తెలిసిందే.
గతేడాది శ్రీలంక క్రికెట్ బోర్డు లాభాలు పెరగడంలో భారత పర్యటన కూడా ఎంతో ఉపకరించిందని బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ మధ్య కాలంలో శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోన్న తరుణంలో బోర్డు ఈ వేతన సవరణ చేయడం ఆటగాళ్లలో ఆనందాన్ని నింపింది. ఆటగాళ్ల వేతనాలను పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకోవడంపై క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.