IPL 2018: Mosquitoes Won the Game

2018-04-27 207

In IPL 2018, The Rajiv Gandhi International Stadium,Uppal in Hyderabad, home to the Sunrisers Hyderabad franchise, is turning out to a nightmare for cricketers thanks to some serious mosquito menace.

దోమల మహా బాధ. మూలమూలల్లో దూరి.. మనశ్శాంతి లేకుండా, ప్రశాంతత కరువు చేసే దోమలు స్టేడియంలో దూరాయి. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఓ వైపు సన్ రైజర్స్ జట్టు.. కింగ్స్XI పంజాబ్ జట్టును ఓ ఆట ఆడిస్తుంటే.. దోమలు మాత్రం రక్తాన్ని పీల్చుతూ ప్రేక్షకులకు నరకాన్ని చూపాయి. నగరంలో దోమలన్నీ మ్యాచ్ చూడటానికి వచ్చాయా అన్నట్లుగా.. స్టేడియం మొత్తం దోమలతో నిండిపోయింది.
దీంతో ప్రేక్షకులు సంతోషంగా మ్యాచ్ ఆస్వాదించలేని పరిస్థితి నెలకొంది. కేవలం ప్రేక్షకులే కాదు.. ఈ మ్యాచ్‌కు భద్రత కల్పిస్తున్న పోలీసులు సైతం దోమలతో పోరాటం చేశారు. వాటిని తరిమేందుకు పాత పేపర్లు, కర్రలు పోగేసి.. స్టేడియం పరిసరాల్లో మంట పెట్టి దోమలను నియంత్రించేందుకు ప్రయత్నించారు. పోలీసుల ఇబ్బందులను తెలుసుకున్న అధికారులు దోమలు కుట్టకుండా ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు స్టేడియం మొత్తం ఫాగింగ్ చేస్తారు. అయితే, అధికారులు కేవలం క్రీడాకారులు, వీఐపీలు కూర్చునే గ్యాలరీల సమీపంలో మాత్రమే ఫాగింగ్ చేసినట్లు తెలిసింది. స్టేడియం బయట పరిసరాలు కూడా శుభ్రంగా లేకపోవడంతో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు.. దోమలకు 'విందు' భోజనంగా దొరికారు.
దోమల బాధ భరించలేక చాలామంది ప్రేక్షకులు మ్యాచ్ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయారు. ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు కేవలం హైదరాబాద్ నుంచే కాదు.. వివిధ రాష్ట్రాల నుంచి ప్రేక్షకులు వస్తుంటారు. కనీసం వీరి గురించైనా నిర్వాహకులు ఆలోచించకపోవడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.