టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీని బుధవారం కోల్‌కతా పోలీసులు మూడు గంటల పాటు విచారించారు. షమీ పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని, తనను వేధింపులకు గురి చేశాడని అతడి భార్య హసీన్ జహాన్ అతడిపై కేసులు పెట్టిన సంగతి తెలిసిందే.
దీనిపై కోర్టు షమీకి సమన్లు జారీ చేయగా... బుధవారం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న షమీ.. నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ కోసం సోమవారం కోల్‌కతాకు వెళ్లాడు. ఈ సందర్భంగా విచారణకు రావాలని షమిని కోల్‌కతా పోలీసులు ఆదేశించారు.
దీంతో షమీ స్థానిక స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు అతడిని మూడు గంటల పాటు విచారించి అనంతరం వదిలిపెట్టారు. విచారణకు షమీ సహకరించాడని, అతను తిరిగి జట్టుతో కలిసేందుకు అనుమతించినట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) ప్రవీణ్ త్రిపాఠి చెప్పారు.
ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ 'షమీ ఐపీఎల్‌లో ఆడే విషయమై మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ అతడిని విచారణ కోసం మళ్లీ పిలుస్తాం. షమి మాకు పూర్తిగా సహకరిస్తున్నాడు" అని తెలిపారు. షమీతోపాటు అతని సోదరుడు హసీబ్ అహ్మద్‌ను కూడా ప్రశ్నించామని తెలిపారు.
భార్యకు షమీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. కేసులు వేసిన తర్వాత లక్ష చెక్ ఇస్తే.. అది కూడా బౌన్స్ అయిందని ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. హసీన్ ఇంటి ఖర్చులు, వ్యక్తిగత అవసరాల కోసం రూ. 7 లక్షలు, కుమార్తె అయిరా ఖర్చుల కోసం మరో రూ. 3 లక్షలు షమీ నుంచి భరణంగా ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు.