KKR Vs RR Match Was Won by KKolkatta Knight Riders that was held in jaipur.
ఐపీఎల్ 11లో భాగంగా రాజస్థాన్, కోల్‌కతా జట్లు రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా సమరానికి సిద్ధమైయ్యాయి. కోల్‌కతా జట్టు టార్గెట్ 161ను ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగానే గెలిచేసింది. లక్ష్యం చిన్నదే అయినా ప్రత్యర్థి జట్టు పరవాలేదనిపించుకున్న బౌలింగ్‌తో చివరి వరకు పొడిగించింది. ఎట్టకేలకు మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. దీంతో ఇదే ఐపీఎల్ లో ఐదో విజయాన్ని నమోదు చేసుకుని.. ఆరు పాయింట్లతో అన్ని జట్ల కంటే మెరుగైన స్థానంలో ఉంది.
గత మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తుగా ఓడించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) అదే జోరు ను కొనసాగిస్తూ మరో విజయాన్ని అందుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధిం చింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. డి ఆర్కీ షార్ట్ (43 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ అజింక్య రహానే (19 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. రాణా, కరన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం కోల్‌కతా 18.5 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రాబిన్ ఉతప్ప (36 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), నరైన్ (25 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నితీశ్ రాణా (27 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
ఫీల్డింగ్, బౌలింగ్‌తో దాడి చేసి రాజస్థాన్ జట్టును కట్టడి చేసింది. రహానె సేన మొత్తంలో ఒక్కరూ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేయలేకపోవడం గమనార్హం. రహానే దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. మరుసటి ఓవర్లోనే ముందుకొచ్చి ఆడబోయిన రహానే.. బంతి వికెట్ల దగ్గరే ఉన్నప్పటికీ అనవసర పరుగు కోసం ప్రయత్నించాడు. వికెట్ల వెనుకే పొంచి ఉన్న కార్తీక్ డైరెక్ట్ త్రో ద్వారా రహానేను అవుట్ చేశాడు. దీంతో రహానే (19 బంతుల్లో 36) రనౌట్‌గా పెవిలియన్ చేరాడు.