Shreyas Gopal revealed how he confused Virat Kohli and AB de Villiers through good length balls by ultimately leading to win Rajasthan royals.
విరాట్ కోహ్లీని అవుట్ చేసేందుకు రాజస్థాన్ రాయల్స్ మంచి వ్యూహం పన్నిందట. కావాలనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి వరుసగా గుడ్ లెంగ్త్ బంతులు విసిరి.. చెత్త షాట్ ఆడేలా చేశానని రాజస్థాన్ రాయల్స్ బౌలర్ శ్రేయాస్ గోపాల్ వెల్లడించాడు.
ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 218 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బెంగళూరు జట్టు దిగింది. విరాట్ కోహ్లి 30 బంతుల్లో (57) వేగవంతమైన హాఫ్ సెంచరీ జట్టును 10.1 ఓవర్లలోనే 101/2తో మెరుగైన స్థితిలో నిలిపాడు. ఈ సమయంలో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ అద్భుతం చేశాడు. వరుస ఓవర్లలో విరాట్ కోహ్లితో పాటు హిట్టర్ ఏబీ డివిలియర్స్ను 18 బంతుల్లో (20) 1x4, 1x6)ను పెవిలియన్ బాట పట్టించాడు.
ప్రధాన బ్యాట్స్‌మెన్‌లు లోపించడంతో బెంగుళూరు జట్టు పరుగులు చేయలేకపోయింది. దీంతో.. చివరికి బెంగళూరు 198/6కే పరిమితమై ఓటమి చవిచూసింది. వీరిద్దరినీ అవుట్ చేసిన ఆనందాన్ని బౌలర్ శ్రేయాస్ గోపాల్ ఇలా పంచుకున్నాడు.
'విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌ని ఔట్ చేసిన బంతులు అంత గొప్పవేమీ కాదు. లయ తప్పకుండా వరుసగా వారిని ఇబ్బందులకి గురిచేసే బంతుల్ని విసిరానంతే. బెంగళూరు వికెట్ గతంతో పోలిస్తే కాస్త నెమ్మదించినట్లు కనిపించింది. మ్యాచ్‌లో పుంజుకోవాలంటే.. ఆ సమయంలో రాజస్థాన్ జట్టుకి కచ్చితంగా ఒక వికెట్ తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో.. నేను వరుసగా విరాట్ కోహ్లీకి గుడ్ లెంగ్త్ బంతులు విసిరి.. అతను చెత్త షాట్ ఆడేలా చేశా. తర్వాత ఏబీ డివిలియర్స్ కూడా నా బౌలింగ్‌కి చిక్కాడు. వీరిద్దరూ ప్రపంచంలోనే అగ్రశ్రేణి క్రికెటర్లు. వీరి వికెట్ తీయడం ప్రతిసారీ సాధ్యం కాకపోవచ్చు. నాకు ఆ అవకాశం దక్కినందుకు గౌరవంగా భావిస్తున్నా. కోహ్లి, ఏబీడీ ఔటైన తర్వాత.. బెంగళూరు జట్టు మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది' అని శ్రేయాస్ గోపాల్ వెల్లడించాడు.