former minister Dadi veerabhadra rao met Ap Education minister Ganta Srinivasa Rao on Sunday at Vizag airport.Dadi explained to minister Ganta Srinivasa rao irrigation issues in Anakapalli assembly segment
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు విశాఖలో ఏపీ రాష్ట్ర మానవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.అయితే విమానాశ్రయంలో కలిశామే తప్ప ఇందులో రాజకీయంగా ప్రాధాన్యత గల అంశాలేవీ లేవని దాడి వీరభద్రరావు తెలిపారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు 2014 ఎన్నికల ముందు సమయంలో టిడిపి నుండి వైసీపీలో చేరారు. దాడి వీరభద్రరావు తనయుడు ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా విశాఖ నగరం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఎన్నికల తర్వాత కొంత కాలం వరకు వైసీపీలోనే దాడి వీరభద్రరావు ఉన్నారు. ఆ తర్వాత ఆయన వైసీపీని వీడారు.
అయితే ఏడాది క్రితం వరకు ఆయన టిడిపిలోకి వస్తారనే ప్రచారం సాగింది. అయితే స్థానికంగా ఉన్న పరిస్థితిుల నేపథ్యంలో టిడిపిలోకి దాడి వీరభద్రరావును చేర్చుకొనే విషయమై టిడిపి నాయకత్వం తర్జనభర్జనలు పడుతోందనే చర్చలు కూడ లేకపోలేదు.
విశాఖకు చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి టిడిపిలో చేరేందుకు రంగం సిద్దమైందని టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇదే తరుణంలో మాజీమంత్రి దాడి వీరభద్రరావు ఏపీ రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. విమానాశ్రయంలో వీరిద్దరు నేతలు కొద్దిసేపు కలిశారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో నీటిపారుదల సమస్యలపై మంత్రి గంటాతో చర్చించినట్టుగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చెబుతున్నారు. గతంలో టిడిపిలో కీలకంగా ఉన్న దాడి వీరభద్రరావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొంత కాలం పాటు ఇదే పద్దతిలో వేచి చూసే ధోరణిలోనే ఉండాలని దాడి వీరభద్రరావు ఉన్నట్టుగా సమాచారం. ప్రత్యేక హోదాపై ఏపీ రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్న తరుణంలో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.