నంద్యాల కేబుల్ టీవిలో మంత్రి భూమా అఖిలప్రియ,ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి వార్తలు నిలిపివేత

2018-04-10 456

Rivalry between Minister Bhuma Akhilapriya and AV Subba Reddy is continuing still today

ఒకప్పుడు తన తండ్రికి అంతా తానై.. ఒకరకంగా భూమా నాగిరెడ్డి 'ఆత్మ' లాగా ముద్రపడ్డ ఏవీ సుబ్బారెడ్డితో మంత్రి అఖిలప్రియకు ఇప్పుడు ఏమాత్రం పొసగడం లేదు. భూమా చనిపోయిన నాటి నుంచే వీరిద్దరి మధ్య వైరం రగులుతోంది.
నంద్యాల కేబుల్ టీవిలో మంత్రి భూమా అఖిలప్రియ,ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వార్తలను పూర్తిగా నిలిపివేశారట. వీరిద్దరికీ సంబంధించిన ఏ వార్తనూ అక్కడి కేబుల్ టీవీ ప్రచారం చేయడం లేదట. దీని వెనకాల ఏవీ సుబ్బారెడ్డి ఉన్నాడనేది భూమా వర్గం ఆరోపణ.
కేబుల్ టీవిలో తమ కార్యక్రమాలను ప్రసారం చేయకపోవడం పట్ల.. దాని యాజమాన్యంతో అఖిలప్రియ మాట్లాడినట్టు తెలుస్తోంది.అయితే.. విషయమేదైనా ఏవీ సుబ్బారెడ్డితోనే తేల్చుకోవాలని యాజమాన్యం చెప్పినట్టు సమాచారం. దీంతో అఖిలప్రియ మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు చెబుతున్నారు.
మొదట భూమా అఖిలప్రియ వార్తలను మాత్రమే కేబుల్ టీవిలో ప్రసారం చేయవద్దని నిర్ణయించుకున్నారట. ఆ మేరకు అలాగే చేయగా..ఆమె సోదరుడు,ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి దీనిపై ఏవీ సుబ్బారెడ్డితో మాట్లాడారట. తన సోదరి వార్తలను కూడా ప్రసారం చేయాలని కోరారట. దీంతో ఆమెతో పాటు ఆయన వార్తలను కూడా కేబుల్ టీవిలో ప్రసారం చేయట్లేదని అంటున్నారు.
భూమా నాగిరెడ్డి ఆస్తులకు సంబంధించిన ప్రతీ లెక్క ఏవీ సుబ్బారెడ్డికి మాత్రమే కచ్చితంగా తెలుసన్న ప్రచారం ఉంది. ఆయన మరణం తర్వాత ఏవీ సుబ్బారెడ్డి వాటిపై తమకు కచ్చితమైన సమాచారం ఇవ్వట్లేదని అఖిలప్రియ ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నారన్న వాదన ఉంది. ఈ క్రమంలోనే అఖిలప్రియ ఏవీ సుబ్బారెడ్డిని దూరం పెట్టడం.. ఆమెకు వ్యతిరేకంగా ఆయన పావులు కదపడం జరుగుతున్నాయంటున్నారు. ఉపఎన్నికల గండమైతే గట్టెక్కింది కానీ.. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో అఖిలప్రియ రాజకీయాలకు, టీడీపీకి ఈ వైరం చేటు చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.