పవన్ తరఫున కొందరు దూతలు తనను జనసేనలో చేరమని ఆఫర్ ఇచ్చారు : జేసీ దివాకర్ రెడ్డి

2018-04-10 10

Telugudesam MP JC Diwakar Reddy on Monday make hot comments on Jana Sena chief Pawan Kalyan and Special Status.

తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం పార్లమెంటు సభ్యుడు సోమవారం ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, బీజేపీ, జనసేన అధినేత పవన్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చేసే పోరాటం బూడిదలో పోసిన పన్నీరే అన్నారు. తనకు ఈ వాస్తవం తెలిసినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు కాదనలేక ఢిల్లీలో నిరసనల్లో పాల్గొన్నానని వ్యాఖ్యానించారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ మొండి వైఖరి తెలిసినందువల్లే ఈ రకంగా మాట్లాడుతున్నానని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా అనే పదం కాకపోయినా దానికి సమానంగా తగిన నిధులు కేటాయిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు.తాము కోరే విధంగా కేంద్రం తగిన నిధులు కేటాయిస్తే ఏపీ ప్రజలను ఒప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని జేసీ అన్నారు.
పవన్ కళ్యాణ్ పైన కూడా జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ తరఫున కొందరు దూతలు తన వద్దకు వచ్చారని, జనసేనలో చేరమని ఆఫర్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. కానీ పార్టీ మారాలన్న ఆ ప్రతిపాదనను తాను తోసిపుచ్చానని చెప్పారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గల్లంతు కావడం ఖాయమని జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలన్న వైసీపీ అధినేత వైయస్ జగన్‌కు జేసీ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ తమ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలతో రాజీనామా చేయిస్తే తాను టీడీపీ తరఫున రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.