Andhra pradesh minister Yanamala Ramakrishnudu and Ganta Srinivasa Rao and Somireddy Chandramohan Reddy on Monday lashed out at BJP and PM Narendra Modi.
తెలుగుదేశం, బీజేపీ నేతల మధ్య విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది.విభజన హామీలు నెరవేర్చలేదంటూ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బీజేపీ, వైసీపీలపై తీవ్ర విమర్శలు చేశారు.
చట్టంలోని 19 అంశాలు, 6 హామీలు అమలు చేయాలని కోరితే ప్రధానికి ఎందుకంత కోపం వస్తున్నదో అర్థం కావడం లేదని మంత్రి యనమల అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తొలి ఏడాది ప్రత్యేక హోదా ఇస్తామన్నారని, రెండవ ఏడాది హోదాపై పరిశీలిస్తున్నామన్నారని యనమల చెప్పారు.మూడవ ఏడాది ప్రత్యేక ఆర్థిక సాయం అందజేస్తామన్నారని దానికి చట్టబద్ధత కల్పించడానికి మరొక ఆరు నెలల సమయం తీసుకున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ అంటున్నారని యనమల అన్నారు.
ప్రధాని మోడీ మాటలే చెబుతారు తప్ప చేతలు శూన్యమనేది రుజువైందని అన్నారు. నాలుగేళ్లలో పేదలకు, మధ్య తరగతికి మోడీ చేసిందేమీ లేదని, బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ నేతలు అనడం హాస్యాస్పదమని తెలిపారు.అన్నీ ఇస్తే ఏపీ అగ్రగామి అవుతుందని బీజేపీ భయపడుతోందని, బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రానికి న్యాయం కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీపై విమర్శలు మాని పోరాటానికి కలిసి రావాలని బీజేపీ రాష్ట్ర నేతలకు మంత్రి గంటా శ్రీనివాసరావు హితవు పలికారు.
చంద్రబాబు.. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఉచ్చులో పడ్డారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు వ్యాఖ్యానించడం అసంబద్దమన్నారు. బీజేపీ అన్ని విధాలా రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు.ప్రధానిని కలిసేందుకు వెళ్తున్న ఎంపీలను లాక్కెళ్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా బీజేపీ నేతలంతా కలిసి రావాలని, ముందుగా వారు రాష్ట్ర వాసులన్న అంశాన్ని గుర్తించుకొని వ్యవహరించాలని గంటా చెప్పారు.