Sachin Tendulkar, whose term as Rajya Sabha MP ended recently, has donated his entire salary and allowances to the Prime Minister's Relief Fund.
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభ పదవీకాలం ఈ మధ్యనే ఇటీవల ముగిసింది. అయితే సచిన్ టెండూల్కర్ సమాజానికి ఉపయోగపడే విధంగా పదవీ విరమణ చేస్తూ ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆరేళ్లలో ఎంపీగా తనకు వచ్చిన జీతం, ఇతర అలవెన్సుల మొత్తాన్ని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చేశాడు.
ఆరు సంవత్సరాలకు కలిపి అతని జీతం మొత్తం రూ.90 లక్షలు వచ్చాయి. సచిన్ విరాళాన్ని గుర్తిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం ఓ లేఖను విడుదల చేసింది. ఇది చాలా మంచి పని అని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాన మంత్రి ఆఫీసు కొనియాడింది. ఆరేళ్లు ఎంపీగా ఉన్నా.. సభకు సరిగా రావడం లేదని సచిన్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి.
అయితే అతను తన ఎంపీ లాడ్స్‌ను మాత్రం సరిగ్గా వినియోగించుకున్నాడు. తనకు ఈ ఆరేళ్లలో వచ్చిన రూ.30 కోట్ల నిధులను దేశవ్యాప్తంగా 185 పనులకు ఉపయోగించారు. అందులో రూ.7.4 కోట్లు కేవలం విద్య, దాని అనుబంధ రంగాలకు సచిన్ ఖర్చు చేయడం గమనార్హం. ఇక సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద సచిన్ రెండు ఊళ్లను కూడా దత్తతకు తీసుకున్నాడు.
మహారాష్ట్రలోని దోంజా, ఏపీలోని పుట్టంరాజు కండ్రిగ గ్రామాలను అతను దత్తతకు తీసుకొని అభివృద్ధి చేశాడు. ఇప్పుడు తన జీతభత్యాల మొత్తాన్నీ విరాళంగా ఇచ్చి మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడు. ఇటీవలే రోడ్డు భద్రతా విషయాలను దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ ధరించమంటూ సచిన్ సూచనలు చేసిన సంగతి తెలిసిందే.