MS Dhoni was almost in tears as he spoke on the return of Chennai Super Kings in the 11th edition of the Indian Premier League
మిస్టర్ కూల్ ధోనీ భావోద్వేగానికి గురైయ్యాడు. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే మహీ ఫ్రాంచైజీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడాడు. రెండేళ్ల నిషేధాన్ని ముగించుకుని ఈ ఏడాది తిరిగి ఐపీఎల్‌లో ఆడుతున్న జట్లు చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్. మరో వారం రోజుల్లో ఈ ఏడాది మెగా ఐపీఎల్ టోర్నీ ప్రారంభంకానుంది.
పునరాగమనం చేస్తోన్న జట్టుకు మళ్లీ మహేంద్ర సింగ్ ధోనీనే నాయకత్వం వహిస్తున్నాడు. నిషేధం కారణంగా గత రెండేళ్లు సొంత జట్టుకు దూరమై రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి గురయ్యాడు. 'ఇప్పుడు తిరిగి సొంత జట్టుకు ఆడుతున్నాను. ఈ క్షణం ఎంతో ఉద్వేగభరితమైనది. ఝార్ఖండ్, టీమిండియా, ఐపీఎల్‌లో టీ20కి క్రికెట్ ఆడాను. ఝార్ఖండ్ తరఫున ఆడింది చాలా తక్కువ.' అని పేర్కొన్నాడు.
ఇంకా మాట్లాడుతూ.. 'భారత్ తరఫున ఇప్పటి వరకు 89 మ్యాచ్‌లు ఆడిన నేను చెన్నై తరఫున ఎనిమిదేళ్లలో 159 మ్యాచ్‌లు ఆడాను. తిరిగి ఈ ఏడాది చెన్నై జట్టు జెర్సీ ధరించడం ఎంతో ఆనందంగా ఉంది' అని ధోనీ భావోద్వేగంతో మాట్లాడాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.