అమరావతిలోనే ఉంటాను రండి: మంత్రి నారాయణ సవాల్ ?

2018-03-30 188

Andhra Pradesh Minister Narayana takes on Jana Sena chief Pawan Kalyan, YSRCP chief YS Jagan and BJP.

వైసీపీ అధినేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీలపై మంత్రి నారాయణ శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీలు లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. వారు ముగ్గురు రాష్ట్రానికి సైంధవుల్లా మారారని ఆరోపించారు. ప్రతి దానికి తాము లెక్క చెప్పామన్నారు. ఆయన పెన్నా బ్యారేజీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పెన్నా బ్యారేజీ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని చెప్పారు. కాంక్రీట్ పనులు, గేట్లు, బిగించే పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. మరో రెండు నెలల్లో బ్యారేజీ అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు.
కేంద్రానికి ఇప్పటికి మూడుసార్లు యూసీలు పంపించామని మంత్రి నారాయణ తెలిపారు. యూసీలు ఇవ్వలేదని, లెక్కలు తప్పుగా చూపిస్తున్నామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎవరు వచ్చినా యూసీలు చూపిస్తామని, తాను శుక్రవారం సీఆర్డీఏ కార్యాలయంలో ఉంటానని చెప్పారు.
రూ.1514.16 కోట్లు ఖర్చు చేసినట్లు యూసీలు పంపించామని నారాయణ తెలిపారు. ఫిబ్రవరి 21 నాటికి పరిశీలనలో ఉన్న బిల్లులను కూడా జోడించి మార్చిలోనూ పత్రాలు పంపించామన్నారు. శాసనసభ నిర్మాణానికి రూ. 561.92 కోట్లు, రహదారులు, డ్రెయిన్లకు రూ. 512.98 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారమిచ్చామన్నారు. అమరావతి ప్రభుత్వ సిబ్బంది గృహాల నిర్మాణానికి రూ. 2209 కోట్ల అంచనా వ్యయంలో రూ.271.78 కోట్లు ఖర్చు చేసినట్లు పంపించామన్నారు.
అమరావతి అభివృద్ధికి సంబంధించి సలహాలిచ్చేందుకు నియమించుకున్న వివిధ కన్సల్టెంట్లకు రూ. 167.48 కోట్లు మొత్తంగా రూ.1514.16 కోట్లకు చాలా స్పష్టంగా యూసీలు సమర్పించామని నారాయణ చెప్పారు. రాజధాని నిర్మాణానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని, అక్కడ 1600 కి.మీ. రహదారి నిర్మాణం చేపడుతున్నామన్నారు.