BJP national spokesman G V L Narasimha Rao today hit out at the Chandrababu Naidu government on use of central funds, said that the utilisation certificates submitted by the state were "fake" as they lacked specific details.
ఏపీలో కొంతకాలంగా భ్రమ రాజకీయాలు చోటు చేసుకున్నాయని జీవీఎల్ నర్సింహా రావు మంగళవారం మండిపడ్డారు. ప్రజలు వాస్తవాలు గుర్తించకుండా ఉండేందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా లేఖకు చంద్రబాబు సరైన జవాబు చెప్పడం లేదన్నారు. రూ.2.44 లక్షల కోట్లను కేంద్రం ఏపీకి ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.1.15 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు.
ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని నాలుగేళ్ల క్రితమే టీడీపీకి తెలుసునని చెప్పారు. తాము కూడా మొదటి నుంచి అదే చెబుతున్నామన్నారు. కేంద్రం హామీ ఇచ్చిన ప్యాకేజీ తీసుకొని ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని చెప్పారు. నాలుగేళ్లలోనే రూ.2.44 లక్షల కోట్ల నిధులు ఇచ్చామన్నారు.
ప్యాకేజీ చాలా అద్భుతమని చంద్రబాబు గతంలో చెప్పారని జీవీఎల్ గుర్తు చేశారు. ప్యాకేజీ ఇచ్చిన కేంద్రానికి చంద్రబాబు కృతజ్ఞతలు కూడా చెప్పారన్నారు. ఇప్పుడు ఈ గోల ఏమిటని ప్రశ్నించారు. ఇచ్చిన నిధులను ఎలా వెచ్చించారో ప్రశ్నిస్తే, సమాధానం ఇవ్వలేని చంద్రబాబు ప్రభుత్వం తమను విమర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు
యూపీఏ హయాంలో ఎంత వచ్చింది, ఎన్డీయే హయాంలో ఎంత వచ్చిందో చంద్రబాబు వద్ద లెక్కలు ఉన్నాయని జీవీఎల్ చెప్పారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారే తప్ప తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేయడం లేదన్నారు. ఈశాన్య రాష్ట్రాలను మినహాయిస్తే మరే ఇతర రాష్ట్రానికి ఇవ్వనంతగా ఏపీకి ఇచ్చామన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. 29సార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుకు అఖిలపక్షం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసమే అఖిలపక్షం అన్నారు. బీజేపీ చేసిన పనులు చెప్పకుండా టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు.