Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrababu Naidu has expressed anguish at YSR Congress MP Vijayasai Reddy.
తనపై, తెలుగుదేశం పార్టీ నాయకులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రధాని కాళ్లకు మొక్కడం భారతీయ సంప్రదాయమా అని ఆయన ప్రశ్నించారు. చనిపోయిన తల్లిదండ్రులను విజయసాయి రెడ్డి నిందించడం దారుణమని అన్నారు. తల్లిదండ్రులు ఎవరికైనా దైవసమానులని, దేవుళ్ల పటాలతో పాటు పెట్టి పూజిస్తామని, అటువంటి తల్లిదండ్రులను నిందించడం భారతీయ సంప్రదాయమా అని చంద్రబాబు అన్నారు. టిడిపి ఎంపీలతో ఆయన బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ట అని చంద్రబాబు అంటూ ఇటువంటి వారినా ప్రధాని కార్యాలయం చేరదీసేది అని అడిగారు. ఎన్ని అవమానాలనైనా రాష్ట్రం కోసం, ప్రజల కోసం సహిస్తానని అన్నారు. తాను ఏ విషయంలోనూ తొందరపడనని, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకంజ వేసేది లేదని స్పష్టం చేశారు.
ఢిల్లీకి వచ్చినవారికి ఎంపీలు సహకరించడం లేదని కొంత మంది అంటున్నారని, ఢిల్లీ ఉండి తెలుగువారికి సహకరించకపోతే సహించబోమని అన్నారు. ఢిల్లీలోని ఎపి భవన్‌ను సమన్వయ వేదికగా వాడుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జార్ఖండ్ బాధితులకు సహకరంచామని, ఢల్లీలో ఉన్నవారు తమకు సహకరించాలని ఆయన అన్నారు.
ఎవరితోనూ రహస్య చర్చలు జరపవద్దని చంద్రబాబు తమ పార్టీ నాయకులకు, ఎంపీలకు సూచించారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనని అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన విషయమని అన్నారు. తన ఇమేజీని, పార్టీ ఇమేజీని దెబ్బ తీసే చర్యలను సహించబోనని అన్నారు తాను జీవితంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కున్నానని, సంక్షోభాలను సమర్థంగా అధిగమించానని చెప్పుకున్నారు.