Google Street View proposal Rejected By Indian Govt

2018-03-28 586

The government has refused Google's proposal to launch its "Street View" service in India, Minister of State for Home Affairs Hansraj Gangaram Ahir said on Tuesday.

ఇంటర్నెట్‌ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌కు భారత ప్రభుత్వం నుంచి చుక్కెదురైంది. గూగుల్ 'స్ట్రీట్‌ వ్యూ' సర్వీసు ప్రతిపాదనను భారత ప్రభుత్వం తిరస్కరించింది. భద్రతా కారణాల రీత్యా ఇండియాలో 'స్ట్రీట్‌ వ్యూ' సర్వీసుకు అనుమతినివ్వడం లేదని తెలిపింది. మంగళవారం లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్‌ గంగారం అహిర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని రక్షణశాఖ అధికారులు చెప్పినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఆయా నగరాల్లోని వీధులను 360డిగ్రీల కోణంలో చూయించేందుకు గూగుల్ 2015, జూలైలో తమకు దరఖాస్తు చేసుకుందని హన్సరాజ్ అన్నారు. ఈ మేరకు మొదట 2011లో బెంగుళూరులో గూగుల్ 'స్ట్రీట్ వ్యూ' సర్వీసును కూడా ప్రారంభించారు. అయితే దీనిపై స్థానిక అధికారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడంతో మధ్యలోనే నిలిపివేశారు. ఆ తర్వాత 31 చారిత్రాత్రక కట్టడాలను 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించేందుకు 2015లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియాతో గూగుల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటినుంచి దీని గురించి భారత ప్రభుత్వంతో కేంద్రం చర్చలు జరుపుతోంది.
కాగా, ప్రస్తుతం 82 దేశాల్లో గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల పర్యాటకులకు, కొత్తవాళ్లకు చిరునామా వెతికి పట్టుకోవడం ఈజీ అవుతుంది. గూగుల్ స్ట్రీట్ వ్యూని 2007లొ మొట్టమొదటిసారిగా అమెరికాలో ప్రవేశపెట్టారు. ఇందుకోసం కార్లు, బైక్‌లపై కెమెరాలను అమర్చి 360 డిగ్రీల కోణంలో స్ట్రీట్స్ చిత్రాలను సేకరించింది గూగుల్. సేకరించిన చిత్రాలను పనోరమిక్‌ త్రీడీ కోణంలో చూసే వెసులుబాటును కల్పించింది.