Ball Tampering : David Warner Set To Lose Sunrisers Hyderabad Captaincy

2018-03-27 78

Sunrisers mentor Laxman said the franchise would wait for Cricket Australia's decision on Warner

కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడటం అటు కెరీర్ పరంగా, ఇటు ఇమేజి పరంగా ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఇబ్బందుల్లో పడేసింది. బాల్ టాంపరింగ్ చేసేందుకు గాను బాన్‌క్రాప్ట్‌ను ప్రోత్సహించినందుకు ఇప్పటికే ఐసీసీ స్మిత్‌కు ఓ టెస్టు మ్యాచ్ నిషేధంతో పాటు వంద శాతం జరిమానా విధించింది.
తాజాగా సోమవారం ఈ బాల్ టాంపరింగ్ వివాదం స్టీవ్‌ స్మిత్‌ను ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు కెప్టెన్సీ నుంచి స్వతహాగా వైదొలగేలా చేసింది. దీంతో ఆ జట్టు కొత్త కెప్టెన్సీ బాధ్యతలను టీమిండియా క్రికెటర్ అజ్యింకె రహానేను ప్రాంఛైజీ నియమించింది. అయితే ఈ వివాదంతో సంబంధం ఉన్న మరో ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ సంగతేంటని మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించాడు.
'రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా స్మిత్‌ కొనసాగడం లేదా.. నిజంగా ఇది ఆసక్తికరమైన విషయమే. ఊహించని ఘటన కూడా. వార్నర్‌ను సన్‌ రైజర్స్‌ కెప్టెన్సీ నుంచి తొలగించరా? ఒక వేళ వార్నర్‌ను తొలగిస్తే ఈ సీజన్‌లో మొత్తం 8 జట్లకు భారత ఆటగాళ్లే కెప్టెన్‌గా ఉంటారు' అని కైఫ్‌ ట్వీట్‌ చేశాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిబంధనల ప్రకారం మోసానికి పాల్పడిన క్రికెటర్లపై జీవితకాల నిషేధం విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ అభిమానులు సైతం వీళ్లిద్దరిపై జీవితకాల నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది.