అరుణ్ జైట్లీతో రహస్య చర్చలు ఎందుకు ?బాబు ఎన్డీఎకు దగ్గరకావాలని చూస్తున్నారా ?

2018-03-24 3

Controversy errupted as the Telugu Desam party MP Sujana Chowdary met finance minister Arun Jaitley.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరిగి ఎన్డీఎలో చేరాలని అనుకుంటున్నారా, అందుకు తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో రహస్య చర్చలు జరిపారా? అవుననే అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు.
అరుణ్ జైట్లీతో రహస్య చర్చలకు చంద్రబాబు సుజనా చౌదరిని పంపించారని సాక్షి మీడియా ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. అరుణ్ జైట్లీ చర్చలకు పిలిచారనే విషయాన్ని సుజనా చౌదరి చంద్రబాబుతో చెప్పిన మాట మాత్రం వాస్తవం. అందుకు చంద్రబాబు నిరాకరించినట్లు కూడా వార్తలు వచ్చాయి
ప్రత్యేక హోదా మినహా మిగిలిన అన్ని విషయాలపై కేంద్రంలోని పెద్దలు సుముఖంగా ఉన్నారని, ఇప్పుడేం చేద్దామని సుజనా చౌదరి చంద్రబాబుతో అన్నారు. కేంద్రమే నేరగా ఆ విషయాలపై మాట్లాడితే బాగుంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
రాష్ట్రంలో భారీగా అవినీతికి పాల్పడి చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి పట్టీసీమ వరకు వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు బిజెపి నేతలు కూడా విమర్శిస్తున్నారని, దాంతో కేంద్రం నుంచి ప్రమాదం ఉందనే ఉద్దేశంతో చంద్రబాబు తిరిగి ఎన్డీఎకు దగ్గరకావాలని చూస్తున్నారని వారన్నారు.
ఏ విధమైన తప్పు చేయకపోతే కేంద్రానికి సవాల్ విసిరి చంద్రబాబు విచారణకు సిద్ధపడవచ్చు కదా అని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. నిజాయితీపరుడైతే చంద్రబాబు విచారణ జరిపించుకోవాలని అన్నారు. అవిశ్వాసంపై చర్చ జరగకుండా ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.
విభజన చట్టంలోని అంశాలను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిందేనని, ఈ విషయంలో మన డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయని వాటిని సాధించుకోవడానికి మనం కేంద్రంపై పోరాటం చేస్తున్నామని, వాటిపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించాల్సిన అవసరం లేదని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు.