Bharatiya Janata Party leader and Cine Actress Kavitha lashed out at Telugudesam Party MLC Rajendra Prasad for his comments on tollywood.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సినిమా వాళ్లు ముందుకు రావడం లేదని, వారికి ఏపీ ప్రయోజనాలు అవసరం లేదా, ఇలా అయితే వారి సినిమాలు ఆడనివ్వరని వ్యాఖ్యానించిన టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌పై ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత కవిత మండిపడ్డారు.
ఆయనకు కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం సినిమా పరిశ్రమ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కానీ మీరే రాజకీయ ప్రయోజనాల కోసం నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పార్టీ అవినీతిని కేంద్రం బయటపెడుతుందనే ఉద్దేశ్యంతోనే యూటర్న్ తీసుకున్నారని కవిత విమర్శించారు. మీ నాటకాలకు తలూపడానికి సినిమా పరిశ్రమ అందుకు సిద్ధంగా లేదని ధ్వజమెత్తారు. ఏసీ రూముల్లో కులుకుతున్నారని రాజేంద్రప్రసాద్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ మాటలకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.
ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే పరిణామాలు వేరేగా ఉంటాయని, తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆయన ఎన్ని రోజులు ఎమ్మెల్సీగా ఉంటారు.. మీ నాయకుడు ఎన్ని రోజులు ఉంటారు అని కవిత నిలదీశారు. మీ అధికారం పరిమిత కాలమని, సినీ పరిశ్రమ మాత్రం శాశ్వతం అని కవిత మండిపడ్డారు. సినీ పరిశ్రమను కేసీఆర్ నెత్తిమీద పెట్టుకొని గౌరవిస్తుంటే ఆయనిచ్చే గౌరవంలో టీడీపీ కొంచెం కూడా ఇవ్వడం లేదన్నారు.
ప్రత్యేక హోదా కోసం తమ్మారెడ్డి భరద్వాజ దీక్ష చేస్తే ఆయనను, ఆయన చుట్టు ఉన్న వారిని కొట్టి, అరెస్టు చేశారని, దీనిని ఏమంటారని నిలదీశారు. ఆ సమయంలో ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్నారని, అందుకే దీక్ష విఫలం చేశారన్నారు. మైక్ ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దని, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను తాను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లానని ఇప్పటికే ఎంపీ మురళీ మోహన్ చెప్పారు. ఇప్పుడు సినీ నటి కవిత కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.