Telugudesam Party MP Kesineni Nani on Wednesday lashed out at Congress leader Chiranjeevi and Jana Sena chief Pawan Kalyan.
కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ అని, పవన్ జనసేన ప్రీపేయిడ్ పార్టీ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందన్నారు. అలాంటి సమయంలో తన అన్నయ్య చిరంజీవిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
నాడు అన్నను ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును విమర్శించడం సరికాదని కేశినేని నాని అన్నారు. బీజేపీకి పోయే కాలం వచ్చిందని ధ్వజమెత్తారు. ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోందన్నారు.
సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడాన్ని కేశినేని నాని తప్పుబట్టారు. సభను ఆర్డర్‌లో ఉంచాల్సిన బాధ్యత సభాపతిదే అని చెప్పారు. అవిశ్వాసంపై చర్చించాలనే ఉద్దేశ్యం కేంద్రానికి ఏమాత్రం లేదన్నారు. ఆ ఆలోచన ఉండి ఉంటే అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఎంపీలతో మాట్లాడేవారని తెలిపారు.
అంతకుముందు, ఎంపీలు బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము రోజుల తరబడి ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రధాని మోడీ నుంచి స్పందన లేదన్నారు. తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని అందరూ గమనిస్తున్నారని తెలిపారు. నాడు కాంగ్రెస్ చేసిన తప్పునే ఇప్పుడు బీజేపీ చేస్తోందన్నారు.