The no-confidence motion moved by the Telugu Desam Party and ysrcp could not be taken up on Wednesday too as the House was adjourned for the day.
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసంపై చర్చ బుధవారం నాడు కూడ ప్రారంభం కాలేదు. టిఆర్ఎస్, అన్నాడిఎంకె సభ్యులు పార్లమెంట్ ఉభయసభల్లో తమ రాష్ట్రాల డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు కొనసాగించడంతో నాలుగో రోజు కూడ అవిశ్వాసంపై చర్చ జరగలేదు. ఉభయసభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదాపడ్డాయి. పార్లమెంట్ ఉభయ సభలు గురువారానికి వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వంపై టిడిపి, వైసీపీలు కూడ మరోసారి అవిశ్వాసం నోటీసులను ఇచ్చారు. అయితే ప్రశ్నోత్తరాలను చేపట్టాలని స్పీకర్ సుమిత్రా మహజన్ భావించారు. అయితే సభ ఆర్డర్‌లో లేదు.
దీంతో స్పీకర్ సుమిత్రా మహజన్ లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు. వాయిదా తర్వాత లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. అయితే సభ ప్రారంభమైన తర్వాత లోక్‌సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.రిజర్వేషన్ల అంశంపై టిఆర్ఎస్, కావేరీ బోర్డు అంశంపై అన్నాడీఎంకె సభ్యులు వెల్‌లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.
అయితే అవిశ్వాసంపై టిడిపి ఎంపీ తోట నరసింహం, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలు ఇచ్చిన నోటీసులు అందాయని స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు. లోక్‌సభలో మంత్రి అనంతకుమార్ అవిశ్వాసంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఈ తరుణంలో అవిశ్వాసంపై చర్చకై ఎంపీల మద్దతు కోసం సభ్యులను లెక్కించాల్సిన అవసరం ఉందని స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు. అయితే సభలో గందరగోళ వాతావరణం మాత్రం కొనసాగింది. ఈ తరుణంలో స్పీకర్ సుమిత్రా మహజన్ లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు.
మరోవైపు రాజ్యసభలో కూడ ఇదే వాతావరణం కన్పించింది. విపక్ష సభ్యుల ఎంపీలు వెల్‌లోకి వచ్చి ఆందోళనకు దిగారు.అయితే రాజ్యసభలో విపక్ష సభ్యులను సహకరించాలని రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు సభ్యులను కోరారు. కానీ, సభ్యుల నుండి ఏ మాత్రం సహకరించలేదు. దీంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తూ రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకొన్నారు.