No Confidence Motion : రాజ్యసభ, లోక్‌సభ వాయిదా ! ఇక చర్చ జరిగేదేప్పుడు ?

2018-03-20 213

YSRCP MP YV Subba Reddy urged TRS and AIADMK MPS to support no confidence motion in parliament.

కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అడ్డంకులు కల్పించవద్దని, చర్చ జరిగేందుకు సహకరించాలని టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలకు చేతులు జోడించి వేడుకున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కావేరీ వివాదం 70 ఏళ్లుగా ఉందని, దానిపై తాము పోరాడుతున్నామని అన్నాడీఎంకే ఎంపీలు చెబుతున్నారని చెప్పారు. వారి సమస్యలపై వారు పోరాటం చేయడంలో తప్పు లేదని... వారి సమస్యలను వారు పోరాటం చేస్తుంటే మనం ఆపలేమని అన్నారు.
ఇది ఐదు కోట్ల ఆంధ్రుల జీవితాలకు సంబంధించిన సమస్య అని, చర్చ కోసం స్పీకర్ అనుమతించే సమయంలో ఆందోళనలు చేపట్టకుండా ఉండాలని కోరామని చెప్పారు. టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలను ఐదు నిమిషాల పాటు సహకరించాలని వేడుకున్నామని... అయినా వారు తమ ఆవేదనను అర్థం చేసుకోవడం లేదని వైవీ సుబ్బారెడ్డి వాపోయారు. కనీసం రేపై(బుధశారం)నా సభ సజావుగా సాగుతుందని ఆశిద్దామని అన్నారు.
అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాలని మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడకు కూడా వైసీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. కాగా, అవిశ్వాస తీర్మానం అనేది ఏపీ పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టింది మాత్రమేనని, ఇదో పొలిటికల్ గేమ్ అని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆరోపించడం గమనార్హం.
కాగా, మంగళవారం కూడా లోక్‌సభలో నిరసనలు చోటుచేసుకోవడంతో.. సభ ఆర్డర్‌లో లేదన్న కారణంగా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ‘అవిశ్వాసం'చర్చను చేపట్టలేకపోయారు. విపక్షాల ఆందోళనల మధ్యే విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌.. ఇరాక్‌లో భారత బందీల మరణానికి సంబంధించిన ప్రకటన చేశారు. అనంతరం స్పీకర్‌ సభను బుధవారానికి వాయిదావేశారు. రెండో విడత బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం నుంచి దిగువ సభ మాదిరే పెద్దలసభలోనూ ఆందోళనలు సాగాయి. మంగళవారం కూడా అలాంటి పరిస్థితే తలెత్తింది. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం తీరును కాంగ్రెస్‌ తప్పుపట్టింది. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్‌ వెంకయ్యనాయుడు రాజ్యసభను బుధవారానికి వాయిదా వేశారు.