With the TDP pulling out of the NDA, there is already talk of a new alliance. Chandrababu Naidu said that in the absence of the Centre giving Andhra Pradesh, special status, the TDP had decided to pull out of the NDA.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత ఊహించని విధంగా ఎన్డీఏ నుంచి వైదొలగడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏపీకి కేంద్రం ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చకపోవడం, ప్రత్యేక హోదా గానీ, ప్యాకేజీపైగానీ స్పష్టత ఇవ్వడకపోవడంతో ఎన్డీఏ నుంచి తప్పుకుంటున్నట్లు టీడీపీ ప్రకటించింది. అంతేగాక, పార్లమెంటులో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ప్రాంతీయ పార్టీలతోపాటు పలు జాతీయ పార్టీలు టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించాయి. శుక్రవారం లోకసభలో గందరగోళం నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్. దీంతో టీడీపీ, వైసీపీల అవిశ్వాస తీర్మానాలు సోమవారం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాల్లో మరోసారి కీలకంగా మారబోతున్నారు. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఒక్కటైన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ)లు బీజేపీని ఓడించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే కేంద్రంలోని బీజేపీకి తగిన గుణపాఠం చెప్పవచ్చని విపక్ష నేతలు భావిస్తున్నారు. కాగా, చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటికి రావాలని తీసుకున్న నిర్ణయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీడీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వాగతించారు.
ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన నేపథ్యంలో చంద్రబాబునాయుడు.. మమతా, ములాయం, మాయావతి పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో కొత్త కూటమికి తెరతీసే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలు కూడా చెబుతుండటం గమనార్హం. దీంతో చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాల్లో మరోసారి ఏం సంచలనానికి కారణమవుతారోననే ఆసక్తి నెలకొంది.
అయితే, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటికి రావడం ఇదే తొలిసారి కాదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతిలో ఓటమిపాలై 2004లో ఆయన ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు. అంతేగాక, బీజేపీని కమ్యూనల్ పార్టీ అంటూ తీవ్ర విమర్శలు కూడా చేశారు.