బీజేపీ ఓటమి : ప్రజల మనో భావాలకు విరుద్దంగా నడుచుకుంటే అంతే !

2018-03-15 423

ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన నేపథ్యంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనో భావాలకు విరుద్దంగా నడుచుకుంటే ఫలితాలు ఈ విధంగానే ఉంటాయన్నారు. బుధవారం సాయంత్రం ఆయన ఉండవల్లిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనాయకులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీయే నుంచి టీడీపీ ఇప్పటికిప్పుడు బయటకు వచ్చేస్తే ఉత్తరప్రదేశ్‌ ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినందున అలా చేశారంటారని, తొందరపాటు నిర్ణయాలు తగదని అన్నారు. అంతేగాక, ఒక వ్యూహం ప్రకారం నడుచుకోవాలని స్పష్టంచేశారు.
ప్రస్తుతానికి ఎన్డీయేలో కొనసాగుతూనే రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల సాధనకు అన్ని మార్గాల్లో ఒత్తిడి తీసుకువద్దామన్నారు. ఇకపై కేంద్రాన్ని మెతగ్గా అడగడం ఉండదని, పోరాటం ద్వారానే అన్నీ సాధించుకుంటామని తెలిపారు. బీజేపీతో పొత్తు కొనసాగించడంపై తగిన సమయంలో రాజకీయ నిర్ణయం తీసుకుందామని చెప్పారు.
‘కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ మంత్రులు వైదొలగాలని మనం నిర్ణయించిన మర్నాడు ప్రధాని నాతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినా ఎన్డీయేలో ఉంటామని, రాష్ట్రానికి మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాను. అప్పుడు కూడా ఆయన అన్ని అంశాలూ పరిష్కరిస్తామన్న హామీ ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా వారి నుంచి ఎలాంటి సానుకూల సంకేతాల్లేవు' అని చంద్రబాబు నేతలకు వివరించారు.
బీజేపీతో పొత్తు వల్ల అటు తెలంగాణలోను.... ఇటు ఆంధ్రప్రదేశ్‌లోను కూడా తాను అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతుందని, తెలంగాణలో రాజకీయంగా ఉపయోగపడుతుందని బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు.