No Confidence Motion : Better To Take Chance By Which Party ?

2018-02-21 2

There is an interesting discussion in AP Political circle on No confidence motion. Some are saying that it's better to take chance by TDP to move no confidence motion, through that there is lot of scope to debate on that.

నిన్న మొన్నటిదాకా రాజీనామా అస్త్రాల చుట్టూ తిరిగిన ఏపీ రాజకీయాలు.. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం వైపు మళ్లాయి. మార్చి 5వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. కేంద్రం మెడలు వంచడానికి ఇదో బ్రహ్మాస్త్రం అని కొంతమంది అభిప్రాయపడుతుండగా.. అది ఆఖరి అస్త్రం మాత్రమే అని సీఎం చంద్రబాబు లాంటి వారు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి తాము సిద్దమని ప్రకటించిన జగన్.. అందుకు టీడీపీని కూడా ఒప్పించాలని పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ సవాల్‌ను స్వీకరిస్తూనే.. ఒకవేళ టీడీపీ ముందుకు రాకపోతే వారి వైఖరేంటో తేట తెల్లమవుతుందంటూ కామెంట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ నుంచి 'అవిశ్వాస తీర్మానం'పై మళ్లీ స్పష్టమైన ప్రకటన రాకపోవడం గమనార్హం.
ఓవైపు ఆఖరి బడ్జెట్ సమావేశాలు కూడా ముగింపు దశకు చేరుకుంటుంటే.. అవిశ్వాస తీర్మానం ఆఖరి అస్త్రంగా ప్రయోగించాలంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలపాలవుతున్నాయి. ఇన్నాళ్లు చూస్తూ కూర్చున్నది చాలక.. తాడో పేడో తేల్చుకోవాల్సిన సందర్భంలోనూ ఏంటీ నాన్చుడు ధోరణి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటివాళ్లు కడిగిపారేస్తున్నారు.
అవిశ్వాసం విషయానికొస్తే.. టీడీపీ గనుక తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టయితే వైసీపీ ప్రవేశపెడితే జరిగే చర్చ కన్నా ఎక్కువగా ఫోకస్ అయ్యే అవకాశం ఉంది. కేంద్రంలో మిత్రక్షం కావడంతో.. జాతీయ స్థాయిలో దీనికి మంచి కవరేజ్ లభించే అవకాశం ఉంది.
అదే సమయంలో ఒకవేళ వైసీపీ గనుక తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకుంటే.. ఆయా పార్టీలు ఏపీ ప్రయోజనాల విషయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను లేవనెత్తే అవకాశం ఉంది. అదే జరిగితే.. మిగతా సమస్యల్లో ఇదీ ఒకటిగా మాత్రమే చర్చకు వస్తుంది తప్ప.. దీని చుట్టే చర్చ కేంద్రీకృతం కాదు. టీడీపీ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టినా.. ఇతర పార్టీల మద్దతు అవసరమే అయినప్పటికీ.. ఆ పార్టీ ద్వారా తీర్మానం పార్లమెంటు ముందుకొస్తే.. విభజన హామిలపై ఎక్కువగా చర్చ జరగడానికి ఆస్కారం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.