Chandrababu Naidu Say No To All Party Meeting

2018-02-20 104

Andhra Pradesh Chief Minister Nara Chandrababu said that no to All Party meeting but he is planning to all associations meeting

ప్రస్తుతం సంక్షోభ సమయం నెలకొందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ మాట్లాడవద్దని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు మంగళవారం కీలక సూచనలు చేశారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం మధ్యాహ్నం ముగిసింది. ఈ భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అలాగే ప్రత్యేక హోదా లేదా ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన హక్కుల విషయంలో అఖిల పక్షానికి బదులు అఖిల సంఘాల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. బీజేపీపై నోరు జారవద్దని సూచించారు.
అందరి అభిప్రాయం మేరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుదామని చంద్రబాబు చెప్పారు. పార్టీలతో పాటు ఏపీ ప్రరయోజనాల కోసం పోరాడే సంఘాలను కూడా కలుపుకొని వెళ్దామని చెప్పారు. హక్కుల సాధన కోసం కలిసి వచ్చే వారి ప్రతి ఒక్కరితో ముందుకు సాగుదామని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సు అనంతరం అందరితో సమావేశమవుదామని చెప్పారు. పార్టీలతో కాకుండా పార్టీలకు అతీతంగా అందరితో మాట్లాడుదామని చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాడే వారినే సమావేశానికి పిలుద్దామని చెప్పారు.
ఏపీకి బడ్జెట్‌లో కేంద్రం మొండి చేయి చూపిందని, అలాగే విభజన హామీల విషయంలో బీజేపీ చెప్పినట్లుగా నడుచుకోవడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. బీజేపీ, టీడీపీ నేతల మధ్య వాగ్యుద్ధం అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం సంక్షోభ సమయంలో ఉన్నామని, ఎవరూ తొందరపడి మాట్లాడవద్దన్నారు.