PNB scam : Rahul Gandhi Questions Modi's Silence

2018-02-19 184

Congress President Rahul Gandhi questioned Prime Minister Narendra Modi and Finance Minister Arun Jaitley's silence over the "Rs 22,000 crore banking scam"

వేలకోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి.. దేశం నుంచి పారిపోయిన నగల వ్యాపారి నీరవ్‌ మోడీ వ్యవహారం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్ వేదిక విమర్శల దాడి కొనసాగుతోంది. విద్యార్థులతో మోడీ నిర్వహించిన పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ 'పిల్లలు ఎలా ఉత్తీర్ణులు కావాలో రెండు గంటలు ప్రసంగిస్తారు కానీ.. 22,000 కోట్ల బ్యాంకింగ్‌ స్కామ్‌పై రెండు నిమిషాలు కూడా మాట్లాడరు' అంటూ ప్రధానిని ఉద్దేశించి రాహుల్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పీఎన్‌బీకి కుచ్చుటోపీ పెట్టిన నీరవ్‌ మోడీ వ్యవహారంపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఇప్పటివరకూ నోరు మెదపకపోవడాన్ని రాహుల్‌ ఆక్షేపించారు. నీరవ్‌ స్కామ్‌పై పెదవివిప్పాలని మోడీ, జైట్లీలకు సూచించారు. మోడీ, జైట్లీల మౌనంపై రాహుల్‌ శనివారం కూడా ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు.
నోట్ల రద్దు అనంతరం వెలుగుచూసిన అతిపెద్ద కుంభకోణం ఇదేనని, ఈ స్కామ్‌పై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకుందని రాహుల్‌ నిలదీశారు. నీరవ్‌ బాగోతంపై సామాజిక న్యాయశాఖ మంత్రి, రక్షణ మంత్రి సహా పలువురు మంత్రులు మాట్లాడుతున్నా.. ఈ వ్యవహారానికి బాధ్యత వహించాల్సిన ఆర్థిక మంత్రి, ప్రధాని ఒక్క మాట మాట్లాడటం లేదని విస్మయం వ్యక్తం చేశారు.
నీరవ్ మోడీతో తనకు వ్యక్తిగత సంబంధాలున్నాయనీ ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యానని బిజెపి తనపై చేస్తున్న విమర్శలను ఆయన కొట్టి పారేశారు. బిజెపి సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోంది అని విమర్శించారు.