Lagadapati Rajagopal to Join Pawan Kalyan's Janasena ?

2018-02-17 10

Jana Sena chief Pawan Kalyan photo in Lagadapati Rajagopal's birthday Flexi.

రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయాల నుంచి తప్పుకున్న విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయంగా మరోసారి మీడియాకు ఎక్కారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వరకు ఓకే. కానీ ఆ ఫ్లెక్సీల్లో లగడపాటితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉండటం గమనార్హం. ఈ ఫ్లెక్సీలను లగడపాటి అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేశారు.
శుక్రవారం లగడపాటి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో కొన్నింటిల్లో ఓ వైపు లగడపాటి రాజగోపాల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మరోవైపు పవన్ కళ్యాణ్ ఫోటోను పెట్టారు.
దీంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా, వస్తే జనసేన పార్టీలో చేరుతారా అనే చర్చ సాగుతోంది. అసలు ఆయన వస్తారా, ఆయన వస్తే పవన్‌ను స్వాగతిస్తారా అనేది చూడాలని అంటున్నారు. లగడపాటి 2019లో రాజకీయ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ సాగుతోంది.
ఇటీవల లగడపాటి పలుమార్లు చర్చనీయాంశంగా మారారు. రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని లగడపాటి 2014కు ముందు ప్రకటించారు. విభజన నేపథ్యంలో ఆయన రాజకీయాలకు దూరమయ్యారు.
అయితే, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆయనను ప్రశంసించారు. దీంతో ఆయన టీడీపీలో చేరుతారా అనే చర్చ సాగింది. అంతేకాదు రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ పరిస్థితి ఎలా ఉందనే దానిపై చంద్రబాబుకు నివేదిక కూడా ఇచ్చారని వార్తలు వచ్చాయి. కానీ తాను టీడీపీలో చేరనని, ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నానని ప్రకటించారు