Team india 4-1 up in the 6-match ODI series, Kohli hinted at the post-match presentation that he would like to test the bench strength in the final ODI.
గతంలో ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాని అరుదైన ఘనతను విరాట్ కోహ్లీ సాధించాడు. ఆరు వన్డేల సిరిస్‌ను మరో వన్డే మిగిలుండగానే 4-1తో కైవసం చేసుకుని సఫారీ గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టించడంతో పాటు వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకుని సైతం పదిలం చేసుకుంది. ఈ సిరిస్‌లో చివరిదైన ఆఖరి వన్డే శుక్రవారం సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్ స్టేడియం వేదికగా జరగనుంది. ఇప్పటికే ఆరు వన్డేల సిరిస్‌ను సొంతం చేసుకున్న కోహ్లీసేన ఆఖరి వన్డేలో కూడా విజయం సాధించి అదిరిపోయే ముంగిపు ఇవ్వాలని భావిస్తోంది.
సుదీర్ఘ పర్యటన కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సఫారీ గడ్డపై గతేడాది డిసెంబర్‌లో అడుగుపెట్టింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో చేజార్చుకుంది. ఇదే వేదికగా జరిగిన మూడో టెస్టులో కోహ్లీసేన విజయం సాధించి అంతే ఆత్మవిశ్వాసంతో వరుసగా తొలి మూడు వన్డేల్లో విజయం సాధించింది. డర్బన్, సెంచూరియన్, కేప్‌టౌన్ వన్డేల్లో విజయం సాధించి వన్డే సిరిస్‌పై పట్టు సాధించింది. అయితే, జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన పింక్ వన్డేలో వర్షం కారణంగా డక్ లూయిస్ పద్ధతిలో భారత జట్టు ఓటమి పాలైంది. ఆ తర్వాత ఐదో వన్డే జరిగే పోర్ట్ ఎలిజబెత్‌లో భారత జట్టుకు పేలవ రికార్డు అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అయితే, గత రికార్డులను బద్దలు కొడుతూ ఐదో వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై 73 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 4-1తో కోహ్లీసేన కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
సఫారీ గడ్డపై వన్డే సిరిస్ గెలిచి పాతికేళ్ల నిరీక్షణకు తెరదించింది. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో కోహ్లీసేన ఆరో వన్డేకు సిద్ధమవుతుండగా, దక్షిణాఫ్రికా మాత్రం చివరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఇప్పటికే వన్డే సిరిస్‌ను కైవసం చేసుకోవడంతో చివరి వన్డేలో కోహ్లీసేన తుది జట్టులో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. నామమాత్రమైన వన్డే కావడంతో రిజర్వ్ బెంచ్ బలం పరీక్షించాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి భావిస్తున్నారు. దీంతో అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్‌లు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.