APCC president Raghuveera Reddy responded to Janasena President Pawan Kalyan Phone on JFC
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఫోన్ చేశారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ కమిటీ(జేఎఫ్‌సీ)కి రూపకల్పన జరుగుతున్న నేపథ్యంలో ఆయన రఘువీరాను ఆహ్వానించారు.
జేఎఫ్‌సీ మద్దతివ్వాలని పవన్ ఈ సందర్భంగా రఘువీరాను కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగే జేఎఫ్‌సీ సమావేశానికి రావాలని రఘువీరాను ఆహ్వానించారు.
అయితే, జేఎఫ్‌సీ సమావేశానికి తాను హాజరు కాలేనని, తమ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ హాజరవుతారని పవన్ కళ్యాణ్‌కు రఘువీరా వెల్లడించారు.
ఇది ఇలా ఉండగా, పవన్ ఫిలాసఫీ ఏంటో అర్థం కావడం లేదని ఏపీ బీజేపీ నేత సుధీష్ రాంబొట్ల అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మీడియా సమావేశాలు పెట్టి సమాచారం ఇవ్వమంటే ఇవ్వరని స్పష్టం చేశారు. పవన్‌కు సమాచారం కావాలంటే ఆర్టీఐ ద్వారా తీసుకోవచ్చని సూచించారు.
మరోవైపు ఎన్నికలు వస్తున్నాయనే కొందరు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సుధీష్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ఏపీ రాజధానికి కేంద్రం ఇచ్చిన రూ.2,500 కోట్లు ముష్టా? అని ఆయన ధ్వజమెత్తారు. పోలవరం డిజైన్‌లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేయాలనుకోవడంతోనే బ్రేక్‌లు పడ్డాయని తెలిపారు. రాష్ట్రానికి కావాల్సినవన్నీ కేంద్రం ఇస్తోందన్న సుధీష్.. బీజేపీపై నెపం మోపడం టీడీపీ తప్పే స్పష్టం చేశారు
సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, పి.మధుకు కూడా పవన్ కళ్యాణ్ గురువారం ఫోన్ చేశారు. నిజనిర్థారణ కమిటీ వివరాలను ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 16న హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు. పవన్ విజ్ఞప్తికి రామకృష్ణ, మధులు అంగీకరించినట్లు తెలిసింది