Reliance Industries Chairman and Managing Director Mukesh Ambani on Tuesday met N. Chandrababu Naidu to discuss investment opportunities in the state.
మీ వద్ద ఉన్న టెక్నాలజీ మా వద్ద కూడా లేదని, విదేశాల్లోను లేదని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ముఖేష్ మాట్లాడారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని (ఆర్టీజీ) అద్భుతంగా తీర్చిదిద్దారని చంద్రబాబుకు కితాబిచ్చారు. ఈ కేంద్రాన్ని పరిశీలించిన ముఖేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్టీజీతో ప్రజలకు అందిస్తున్న సేవలను చంద్రబాబు ఆయనకు వివరించారు.ఆర్టీజీని అన్ని రాష్ట్రాలకు చూపించాలని ముఖేష్ అంబాని.. చంద్రబాబుకు సూచించారు. ఏపీతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం డాటా అనేది ఎంతో కీలకమైన అంశమన్నారు.
మా కంటే మీరే ఎంతో ముందు ఉన్నారని ముఖేష్ అంబానీ అన్నారు. మూడేళ్ల క్రితం చంద్రబాబును కలిశానని, పాలనపై అప్పుడు ఆయన ఓ విజన్ చెప్పారని, అప్పుడు నేను చూద్దాంలే అనుకున్నానని, కానీ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ చూశాక సంతోషంగా ఉందన్నారు.
ముఖేష్ అంబానీ ఇంకా మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు.. మా తండ్రిని కలిసినప్పుడు టెలికాం రంగం వైపు అడుగు వేయాలని కోరారని చెప్పారు. సెల్ ఫోన్ ఉత్పత్తులను భారీగా పెంచామన్నారు. సెల్ ఫోన్ ధరను రూ.1500కు తేగలిగిన ఘనత మాదే అన్నారు. కాల్ లిస్టును 42 పైసలకు తగ్గించామని చెప్పారు. తిరుపతిలో 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ముఖేష్ తెలిపారు. 10 మిలియన్ల జియో ఫోన్ల తయారీ, టీవీల తయారీ, చిప్ డిజైన్, బ్యాటరీ తయారీ, సెట్ టాప్ బాక్సు తయారీ కంపెనీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీలో ఒక్క రోజులో పది లక్షల ఫోన్లు తయారు చేసే కంపెనీ తిరుపతిలో ఏర్పాటుకు అంబానీ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అనుమతులు వస్తే రెండు వారాల్లోనే శంకుస్థాపనకు సిద్ధమని చెప్పారు.